: ఆ వర్సిటీలో అమ్మాయిలు, అబ్బాయిలు కన్నెత్తి చూసుకున్నా శిక్ష అనుభవించాల్సిందే.. షాకింగ్ నిబంధనలు పెట్టిన వర్సిటీ!
చైనాలోని షాండాంగ్ ప్రావిన్స్‌లో ‘క్వింగ్‌డావో బిన్‌హాయ్’ యూనివర్సిటీ తన విద్యార్థులకు కొన్ని షరతులు పెట్టింది. చైనా సామాజిక మాద్యమాల్లో ఇప్పుడంతా ఈ విషయంపైనే పోస్టులు కనిపిస్తున్నాయి. చదువుకునే అమ్మాయిలు, అబ్బాయిలు కళాశాల ఆవరణలో కన్నెత్తి కూడా చూడడానికి వీల్లేదని వర్సిటీ కండిషన్ పెట్టింది. వర్సిటీ నిబంధనల ప్రకారం అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి తిరగకూడదు, మాట్లాడుకోకూడదు, చేతిలో చేయి వేసుకొని కనిపించకూడదు అనే నిబంధనలేగాక, ఒకే హెడ్‌సెట్‌తో అమ్మాయిలు, అబ్బాయిలు పాటలు వినకూడదు. అలాగే వర్సిటీలో ఉన్న క్యాంటీన్‌లో భోజనం చేసేటప్పుడు కూడా వారి మధ్య సంభాషణలు, సంజ్ఞలు చేసుకోకూడదని పేర్కొంది. తమ ఆదేశాలు పక్కనపెట్టి ఒకవేళ వారు అవధులు దాటితే శిక్ష అమలు చేస్తున్నట్లు తెలిపింది. శిక్షగా కాలేజీలోని మరుగుదొడ్లను, పరిసరాలను వారిచేత శుభ్రం చేయిస్తామని పేర్కొంది. ఈ శిక్షలు కేవలం విద్యార్థులకే కాకుండా తమ వర్సిటీలో పనిచేస్తోన్న అందరికీ వర్తిస్తాయని కూడా తెలిపింది. ఈ విషయంపై సదరు వర్సిటీ మేనేజర్ మాట్లాడుతూ, సమాజంలోని ప్రజలతో ప్రవర్తించాల్సిన తీరు పట్ల అవగాహనను విద్యాలయం నుంచే అలవరుచుకోవాలని తాము ఈ నిబంధనలు పెట్టామని, విద్యార్థుల భవిష్యత్తుకి తమ విధానలు ఉపయోగపడతాయని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో మాత్రం విద్యార్థులు తమ స్నేహితులతో స్నేహంగా ఉండలేకపోతున్నామని, కాలేజీలో తమ ప్రియురాళ్లతో గడపలేకపోతున్నామని వాపోతున్నారు.