: పెట్రో ఉత్పత్తుల దిగుమతులను తగ్గించుకోవడంపై కేంద్రం దృష్టి
మనం అత్యధికంగా దిగుమతి చేసుకునే వాటిలో పెట్రోలియం ఉత్పత్తులది సింహభాగం. దీనికోసం మనం ఎంతో ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో, ముడిచమురు, గ్యాస్ దిగుమతులను తగ్గించుకోవడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలో, దిగుమతులను తగ్గించుకోవడానికి ఉన్న మార్గాలను అన్వేషించడానికై నిన్న ప్రధాని మోదీ నేతృత్వంలో అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రధానితో పాటు హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పర్యావరణ మంత్రి ప్రకాష్ జవదేకర్, నీతి అయోగ్ ఛైర్మన్, సీఈవోలతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్యాన్ని ఎలా సాధించాలో పెట్రోలియం మంత్రిత్వ శాఖ వివరించింది. దేశీయంగా గ్యాస్, ముడిచమురు ఉత్పత్తిని పెంచడం, జీవ, పునరుత్పాదక ఇంధనాలను ప్రోత్సహించడం, అందుబాటులో ఉన్న ఇంధనాన్ని సమర్థవంతంగా, పొదుపుగా వినియోగించడం తదితర మార్గాల ద్వారా లక్ష్యాన్ని చేరుకోవచ్చని సూచించింది.