: గడ్డాలు పెంచితే ముఖ్యమంత్రులైపోతారా?.. ఉత్తమ్‌కుమార్‌పై మంత్రి కేటీఆర్ ఫైర్
గడ్డాలు పెంచినంత మాత్రాన ముఖ్యమంత్రులు కాలేరు సరికదా, సన్యాసులు కావడం ఖాయమని తెలంగాణ మంత్రి కేటీఆర్ చమత్కరించారు. బుధవారం వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా మర్రి యాదవ్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ, కొందరు తమ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చే వరకు గడ్డం పెంచుతామంటూ ప్రతిన బూనారని, గడ్డాలు పెంచితే ముఖ్యమంత్రులు కాలేరు సరికదా సన్యాసుల్లో కలవడం ఖాయమని పరోక్షంగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డిని ఉద్దేశించి పేర్కొన్నారు. ‘‘అధికారం వచ్చే వరకు గడ్డం తీయనని ఒకాయన ప్రతిజ్ఞలు చేస్తున్నారు. మంచిదే కానీ గడ్డాలు పెంచినంత మాత్రాన ముఖ్యమంత్రులు కాలేరు. ప్రభుత్వాలు ఏర్పడవు. ప్రజలు కాంగ్రెస్‌ను విశ్వసించడం లేదు. వాళ్ల మొహాలు చూడలేకే కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేశారు’’ అని పేర్కొన్నారు. 2001లో ఏర్పడిన చత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఇప్పటికీ నిలదొక్కుకోలేదని, కానీ రెండేళ్ల క్రితం ఏర్పడిన తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోందని అన్నారు. కొంతమందికి ఇది మింగుడు పడడం లేదని అన్నారు. దేశంలో జరుగుతున్న అన్ని సర్వేలు 'కేసీఆరే నెంబర్ వన్ సీఎం' అని చెబుతున్నాయని తెలిపారు. ఉద్యమంలో పోరాడిన ప్రతి ఒక్కరికీ పదవులు ఇస్తామని, ఓపిక అవసరమని మంత్రి సూచించారు.