: ఇంట్లో ఆడపిల్లలను ఎవరైనా వేధిస్తే నేనైనా అలాగే రియాక్ట్ అవుతా: పరిటాల శ్రీరామ్
అనంతపురం జిల్లా రాప్తాడులో ఒక పీజీ విద్యార్థిని ఓబులేష్ అనే రౌడీషీటర్ వేధించిన సంఘటనలో అతన్ని నగేష్ చౌదరి అనే వ్యక్తి దారుణంగా చితకబాదిన సంఘటన ఇటీవల జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో, న్యూస్ ఛానెళ్లలో ప్రసారమైన విషయం తెలిసిందే. అయితే, సదరు విద్యార్థిని పెళ్లి చేసుకోబోయే వ్యక్తి నగేష్ చౌదరి.. మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ కారు డ్రైవర్ అని ప్రచారం జరిగింది. పరిటాల శ్రీరామ్ అండతోనే ఈ విధంగా నగేష్ చౌదరి రెచ్చిపోయాడనే విమర్శలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఒక న్యూస్ ఛానెల్ తో పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ, ‘నగేష్ చౌదరి వెనుక మేమున్నామనే విషయం ముఖ్యం కాదు. అది వ్యక్తిగత విషయం. ఆరోజు వాళ్లు రియాక్ట్ అవడానికి కారణం వారి వెనుక ఎవరో ఉన్నారని కాదు. ఈ సంఘటనపై లోతుగా ఆలోచిస్తే అన్నీ తెలుస్తాయి. అందరిలాగే మేము చట్టాన్ని గౌరవిస్తాం. చట్టాన్ని గౌరవించద్దంటూ మేమేమీ క్లాసులు పెట్టి చెప్పట్లేదు. ఈ సంఘటనలో అతను రియాక్ట్ అయిన పద్ధతి కరెక్టని నేను చెప్పను. అయితే, వాళ్లు ఎంత బాధతో ఉంటేనో, ఆ అమ్మాయిని ఎంతగా వేధిస్తేనో ఆవిధంగా వాళ్లు రియాక్ట్ అయి ఉంటారో మనం ఆలోచించాలి. ఇంట్లో ఆడపిల్లలను ఎవరైనా వేధిస్తే నేనైనా అలాగే రియాక్ట్ అవుతాను. అది నా క్షణికావేశం కావచ్చు, ఆలోచన కావచ్చు’ అని సమాధానం చెప్పారు. ‘అమ్మాయిల్ని వేధించిన వారెవరైనా మీ దగ్గరకు వస్తే మీ ప్రైవేట్ సైన్యంతో సమస్యను పరిష్కరిస్తారా?’ అనే ప్రశ్నకు పరిటాల శ్రీరామ్ స్పందిస్తూ, ‘ప్రైవేట్ సైన్యంతో కాదు, అమ్మాయిలతోనే సమస్యను పరిష్కరిస్తాను. తప్పు జరిగినప్పుడు ప్రైవేట్ సైన్యం పెట్టి సమస్యను పరిష్కరించాల్సిన అవసరం లేదు. అమ్మాయిలు వాళ్లకు వాళ్లు రియాక్ట్ అయ్యేటట్లు, మహిళా సంఘాలు రియాక్ట్ అయ్యేటట్లు, పోలీసులు స్పందించేటట్లు చేసేందుకు మా సపోర్ట్ కచ్చితంగా ఉంటుంది’ అని చెప్పుకొచ్చారు.