: నేను పేరు మోసిన రౌడీని.. నన్ను అరెస్ట్ చేయండంటూ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన వ్యక్తి.. పోలీసుల మైండ్ బ్లాంక్!


సోమవారం రాత్రి పదిన్నర గంటల సమయంలో తమిళనాడు చెన్నయ్ లోని ఎగ్మోర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన వ్యక్తి చెప్పిన మాటలతో పోలీసులు అవాక్కయ్యారు. తూలుతూ వచ్చిన ఆ వ్యక్తి తానో పేరుమోసిన రౌడీనని, తనను అరెస్ట్ చేయాలని వేడుకున్నాడు. దీంతో అతడు జోక్ చేస్తున్నాడని, తాగిన మత్తులో ఏదోదో మాట్లాడుతున్నాడని పోలీసులు భావించారు. స్టార్ కమెడియన్ వడివేలు అభిమాని అయి ఉంటాడని అనుకుని అతడి మాటలను నమ్మలేదు. అయితే దీపావళి రోజు కన్నగినగర్‌లో జరిగిన ముగ్గురు యువకుల హత్యలో తన ప్రమేయం ఉందని అతను తీరిగ్గా చెప్పడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని జైలుకు పంపారు. విషయాన్ని కన్నినగర్ పోలీసులకు తెలిపారు. అక్కడి నుంచి వచ్చిన అధికారులు తాగి ఉన్న వ్యక్తిని సంతోష్ కుమార్‌(28)గా గుర్తించి ప్రశ్నించారు. సంతోష్ కుమార్ అలియాస్ నందు కూవమ్ నదీ ఒడ్డున కుటుంబ సభ్యులతో కలిసి ఉంటూ చేపలు బండి నడుపుతూ జీవిస్తున్నట్టు పోలీసులు నిర్ధారించారు. తాగిన మత్తులోనే అతడు తానో రౌడీనని చెబుతున్నట్టు అనుమానిస్తున్నారు. అయితే ప్రస్తుతం అతడిని విడిచిపెట్టేది లేదని, ముగ్గురు హత్యలకు, ఇతడికి ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. దీపావళి రోజున కన్నగినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్.కాలియా అలియాస్ రంజిత్ కుమార్(22), టి.సెబాష్టియన్ అలియాస్ మిల్లర్(20), శక్తివేల్(22) హత్యకు గురయ్యారు. గంజాయి అక్రమ రవాణా చేసే వీరు గ్యాంగ్ వార్‌లో భాగంగా హత్యకు గురై ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యతో ప్రమేయం ఉందని భావిస్తున్న 8 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News