: నియోజక వర్గం ఇంచార్జ్ తో విభేదాలు.. నలుగురు టీడీపీ ఎంపీటీసీలు రాజీనామా
కృష్ణా జిల్లా నూజివీడు మండలానికి చెందిన నలుగురు టీడీపీ ఎంపీటీసీలు రాజీనామా చేశారు. పల్లలమూడి, ఎంఎన్ పాలెం, దిగవల్లి, రావిచర్లకు చెందిన ఎంపీటీసీలు సంధ్యారాణి, శోభారాణి, నాగేంద్రప్రసాద్, సాంబశివరావు లు తమ రాజీనామా లేఖలను ఎండీవో రాణికి ఈరోజు అందజేశారు. అయితే, వారి రాజీనామాలను ఆమె తిరస్కరించారు. ఇది తన పరిధిలోనిది కాదని, జిల్లా పరిషత్ సీఈఓ కు అందజేయాలని ఆమె సూచించారు. ఈ సందర్భంగా సదరు ఎంపీటీసీలు మాట్లాడుతూ, రేపు మచిలీపట్నం వెళ్లి తమ రాజీనామాలను సమర్పిస్తామని చెప్పారు. కాగా, గత కొంతకాలంగా నియోజకవర్గ ఇంచార్జ్ ముద్రబోయిన వెంకటేశ్వరరావు, ఎంపీటీసీల మధ్య వివాదం కొనసాగుతోంది. గ్రామాల్లో చేపట్టే కార్యక్రమాల గురించి తమకు తెలియడం లేదని, ఈ విషయమై అధికారులను ప్రశ్నిస్తే ఆ కార్యక్రమాలను నియోజకవర్గ ఇంచార్జ్ ఏర్పాటు చేశారని చెబుతున్నారనే సమాధానం రావడంతో మనస్తాపం చెందిన వారు తమ రాజీనామాలను సమర్పించినట్లు సమాచారం.