: మూడుచక్రాల కారుతో రహదారిపైకి వచ్చి వాహనదారులకు, ట్రాఫిక్ పోలీసులకి చుక్కలు చూపిన చిన్నారి!
చిన్న పిల్లలకి మూడు చక్రాల బొమ్మ కారు అంటే భలే సరదా.. ఆ బొమ్మకారు ఎక్కి ఇంట్లోనో, ఇంటి ముందు ఉన్న ఖాళీ స్థలంలోనే ఆడుకుంటుంటారు. అయితే, ఓ చిన్నారి అలాంటి చక్రాల కారును నడుపుకుంటూ రహదారిపైకి వచ్చేసి నానా హంగామా చేసేశాడు. చైనాలోని ఝెజియాంగ్ రాష్ట్రంలోని లిషుయి నగరంలో ట్రాఫిక్ సీసీటీవీ కెమెరాలకు ఇటువంటి దృశ్యమే చిక్కింది. ఓ పిల్లాడు తన బండిపై రోడ్డుపైకి వచ్చి ట్రాఫిక్ పోలీసులకి చుక్కలు చూపించాడు. రోడ్డుపై వెళుతున్న వాహనదారులకి ఇబ్బందులు తెచ్చిపెట్టాడు. రోడ్డుపై వస్తోన్న వాహనాలకు ఎదురుగా ఈ చిన్నారి తన చిన్న బండిని పోనిచ్చాడు. చిన్నారికి తమ వాహనాలు ఎక్కడ తగులుతాయోనని వాహనదారులు తమ వాహనాలని పక్కనుంచి తిప్పుకొని వెళ్లిపోయారు. బిజీగా ఉన్న రోడ్డులో ఈ చిన్నారి కనబరిచిన ఈ దృశ్యాన్ని ఇప్పుడు నెటిజన్లు విపరీతంగా చూసేస్తున్నారు. పెద్దపెద్ద వాహనాల మధ్య తన చిన్ని చక్రాలబండిని పోనిస్తూ భయం లేకుండా, తెలియనితనంతో ప్రవర్తించాడు. పిల్లాడు నడిరోడ్డుపై తన చక్రాల బండిని పోనిస్తుండడంతో అక్కడ వాహనాలన్నీ మెల్లిగా ముందుకు కదిలాయి. ఈ విషయాన్ని గమనించిన ఓ ట్రాఫిక్ పోలీసు వెంటనే చిన్నారి దగ్గరకు చేరుకొని వాడి చిన్ని కారుతో పాటు వాడిని తీసుకొని రోడ్డుపక్కకు వచ్చాడు. అక్కడి నుంచి వాడిని తీసుకెళ్లి తల్లిదండ్రులకు అప్పగించాడు. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ... ఆ పిల్లాడిని అలా రోడ్డుపై వదిలేసిన వాడి తల్లిదండ్రులను తిట్టుకుంటున్నారు. మరి కొందరు ట్రాఫిక్ పోలీసుని మెచ్చుకుంటున్నారు.