: వైఎస్ వల్లే నాడు చంద్రబాబు ధనబలాన్ని ఓడించాం: దిగ్విజయ్ సింగ్
2004 ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు వైఎస్ నాయకత్వ పటిమ ఎంతో సహకరించిందని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన, అప్పటి ఎన్నికల్లో డబ్బు గురించిన ఆందోళన వద్దంటూ, ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థికి కోట్ల కొద్దీ ధనసహాయం చేశారని, ఆడు వైఎస్ వల్ల చంద్రబాబు ధనబలాన్ని ఓడించామని చెప్పారు. ఇప్పుడు కూడా చంద్రబాబు డబ్బునే నమ్ముకుంటూ, ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 10 కోట్లు ఇస్తామని ఆయన బాహాటంగానే చెబుతున్నారని విమర్శించారు. బాబు సర్కారు అవినీతిలో కూరుకుపోయిందని, తెలుగు రాష్ట్రాల్లో నిర్మాణ కంపెనీలను కాదని సింగపూర్ వైపు మొగ్గెందుకు చూపుతున్నారని ప్రశ్నించారు. నాగార్జునసాగర్ వంటి భారీ ప్రాజెక్టులు కట్టిన భారత ఇంజనీర్లను, కేవలం మురికి కాలువలు మాత్రమే నిర్మించగలరంటూ అవమానించారని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా విషయంలో ఆయన బీజేపీతో రాజీపడ్డారని దిగ్విజయ్ విమర్శించారు.