: అమ్మాయి పంపిన ‘ఐ లవ్ యూ’ మెసేజ్ రెండు గ్రామాల మధ్య కొట్లాట పెట్టింది!
ఓ అమ్మాయి తన పొరుగింట్లో ఉన్న మహిళ మొబైల్‌ను తీసుకొని పంపిన మెసేజ్‌తో రెండు గ్రామాల ప్రజలు కొట్టుకున్న ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. విల్లిపురానికి చెందిన ఓ పదిహేనేళ్ల అమ్మాయి తమ ఇంటి ముందు నివసిస్తోన్న ఓ మహిళకు చెందిన ఫోనును తీసుకుంది. తన బంధువయిన 20 ఏళ్ల గోపీనాథ్‌కు ఆ అమ్మాయి ‘ఐ లవ్ యూ’ అని మెసేజ్ పంపించింది. తనకు వచ్చిన ఆ ఎస్ఎమ్ఎస్‌కు గోపీనాథ్ స్పందిస్తూ కాసేపటి తరువాత అదే నెంబరుకి ఫోన్ చేశాడు. ఫోన్ ఎత్తిన మహిళ ఆ మెసేజ్ తన మొబైల్ నుంచి వచ్చిందే కానీ, అలా ఎవరు పంపించారో మాత్రం తనకు తెలియదని పేర్కొంది. అయినప్పటికీ గోపీనాథ్ వినిపించుకోకుండా పలుసార్లు ఫోన్ చేశాడు. చివరికి ఆ మహిళ గట్టిగా మాట్లాడి మరోసారి ఫోన్ చేయొద్దని చెప్పింది. అయితే, గోపీనాథ్ ఆ మహిళతో అసభ్యకరంగా మాట్లాడాడు. దీంతో ఆ మహిళ తన సమీప బంధువు అయ్యప్పన్ (18)కు ఈ విషయాన్ని తెలిపింది. స్పందించిన అయ్యప్పన్ గోపీనాథ్‌ను హెచ్చరించాడు. అయినా గోపీనాథ్ వినిపించుకోలేదు. ఆగ్రహం తెచ్చుకున్న అయ్యప్పన్ తన నలుగురు మిత్రులను తీసుకుని గోపీనాథ్ ఉంటున్న మున్నియన్‌పెట్టయ్‌కి వెళ్లి గొడవకు దిగాడు. గొడవకు దిగిన వారికి స్థానిక పెద్దలు నచ్చజెప్పారు. అయినా వారు వినిపించుకోకుండా, గోపీనాథ్‌కు తాము బుద్ధి చెప్పి మరోసారి ఇలా చేయకుండా చూస్తామని చెప్పారు. దీంతో గోపీనాథ్ తనకు అవమానం కలిగిందని భావించి, తన ఐదుగురు మిత్రులతో కలిసి అయ్యప్పన్ స్నేహితులను తరిమాడు. దీంతో ఇరు వర్గాలు కర్రలు, రాళ్లతో గొడవకు దిగి కొట్టుకున్నారు. అయ్యప్పన్‌కు గాయాలు కావడంతో పాండిచేరిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స కు తరలించారు. అతడికి గాయాలయ్యాయని తెలుసుకున్న అతని గ్రామస్తులు 10 మంది మున్నియన్‌పెట్టయ్ తరలివెళ్లి గోపీనాథ్‌పై దాడికి దిగారు. అయితే, గోపీనాథ్ గ్రామానికి చెందిన వారు అతనికే మద్దతుగా నిలిచారు. చికిత్స పొందుతున్న అయ్యప్పన్ గ్రామానికి చెందిన వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఎటువంటి ఉద్రిక్తత చోటుచేసుకోకుండా ఇరు గ్రామాల వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు.