: అతని కోసం అమ్మాయిగా మారితే తిరస్కరణ... ప్రకాశం జిల్లాలో ఆసక్తికర కేసు!
ప్రకాశం జిల్లాలో ఓ ఆసక్తికర కేసు వెలుగులోకి వచ్చింది. దుర్గారావు అనే యువకుడికి 2007లో రాకేష్ రెడ్డి అనే మరో యువకుడితో ఏర్పడిన స్నేహ బంధం, సమాజం అంగీకరించని ప్రేమ బంధంగా మారింది. ఆపై 2010లో ముంబైకి వెళ్లిన దుర్గారావు లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకుని దుర్గగా మారి తిరిగి వచ్చింది. చాలాకాలం ఇద్దరూ సహజీవనం చేశారు కూడా. ఆపై దుర్గను తిరస్కరించి, రెండేళ్ల క్రితం రాకేష్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో దుర్గ నిలదీయగా, పరిహారం ఇస్తానని చెబుతూ రూ. 10 లక్షలకు ప్రాంసరీ నోట్లు రాసిచ్చాడు. ఇది జరిగి రెండేళ్లవుతోంది. నోటు గడువు దగ్గర పడుతున్నప్పటికీ పరిహారం ఇవ్వలేదని ఆరోపిస్తూ, శుక్రవారం నాడు దుర్గ కృష్ణా జిల్లా పెనమలూరుకు వెళ్లి రాకేష్ రెడ్డి తండ్రి చిరంజీవిరెడ్డిని నిలదీసింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే, ఒంగోలులో జరిగిన ఘటన కాబట్టి అక్కడే ఫిర్యాదు చేయాలని వారు సలహా ఇచ్చారు. చిరంజీవి రెడ్డి ఓ బ్యాంకు ఉద్యోగికాగా, బ్యాంకు ముందు కూడా నిరసన తెలిపింది. రాకేష్ చిరునామా చెప్పాలని దుర్గ గొడవ చేసింది. దీంతో పోలీసులు బ్యాంకు ముందు గొడవ చేసినందుకు దుర్గపై, దుర్గను మోసం చేసినందుకు రాకేష్ పై కేసులు పెట్టారు. విచారణ జరుపుతున్నామని, రాకేష్ కేసును ఒంగోలుకు బదిలీ చేస్తామని తెలిపారు.