: చంద్రబాబులో ఆయనకు ఏం నచ్చిందో చెప్పాలి: సి.రామచంద్రయ్య డిమాండ్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పొగడ్తల వర్షం కురిపిస్తుండటంపై కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య మండిపడ్డారు. చంద్రబాబులో వెంకయ్యకు అంతగా నచ్చిందేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులకు నష్టం చేకూర్చే విధానాలా? ఓటుకు నోటు కేసులో దొరికిపోవడమా? పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడమా? ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమా? వీటిలో వెంకయ్యకు నచ్చిన అంశాలు ఏంటని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాన్ని నిలువునా దోపిడీ చేస్తున్నందుకు చంద్రబాబును అభినందించారా? అని నిలదీశారు. కేవలం అరుణ్ జైట్లీని అభినందించడానికే అమరావతిలో నిన్న శంకుస్థాపన సభ ఏర్పాటు చేశారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఉన్నప్పటికీ... కమిషన్ల కోసమే పోలవరాన్ని రాష్ట్రమే చేపట్టేలా చంద్రబాబు చూసుకున్నారని విమర్శించారు. అందుకు సహకరించినందుకు అరుణ్ జైట్లీని సన్మానించారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.