: ఢిల్లీలోని కేంద్ర మంత్రుల నివాసాల వద్ద భద్రత పెంపు


ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల సమాచారం మేరకు ఢిల్లీలోని కేంద్ర మంత్రుల నివాసాల వద్ద భద్రతను అధికారులు పెంచారు. సర్జికల్ స్ట్రయిక్స్ కు ప్రతీకారం తీర్చుకోవాలని గత కొంత కాలంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న పాకిస్థాన్ ఆటలు సాగకపోవడంతో ప్రతీకారంతో కుతకుతా ఉడికిపోతోంది. దీంతో ఏ క్షణమైనా విరుచుకుపడాలని స్లీపర్ సెల్స్ సహా, ఉగ్రవాదులకు ఆదేశాలు జారీ చేసింది. దీపావళి నేపథ్యంలో దాడులు చేస్తే మరింత విశ్వాసం పెంచుకోవచ్చని ఆలోచన చేస్తోంది. అందులో భాగంగా ప్రముఖులు, కేంద్రమంత్రులపై దాడులకు దిగే ప్రమాదముందన్న నిఘావర్గాల సమాచారంతో, అక్బర్‌ రోడ్‌ లోని హోం మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్ ఇంటి వెనుక గేటు మూసివేశారు. ఇంటికి ఇరువైపులా వేగంగా స్పందించే బృందాలను (క్యూఆర్‌టీ) ఏర్పాటు చేశారు. అరుణ్‌ జైట్లీ, జితేందర్‌ సింగ్‌ నివాసాల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. పృథ్వీరాజ్‌ రోడ్‌ లోని అద్వానీ ఇంట్లోనూ వెనుకగేటు మూసేసి, భద్రతను పెంచారు. కమాండోలను నియమించారు. ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి నివాసం వద్ద కూడా భద్రతా వ్యవస్థను పునర్‌ వ్యవస్థీకరించారు. వీరితో పాటు, సైనిక దళాల ప్రధానాధికారి జనరల్‌ దల్బీర్‌ సింగ్‌ సుహాగ్‌, ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నజీబ్‌ జంగ్‌ ఇళ్ల వద్ద కూడా భద్రతను పెంచారు. ప్రముఖుల ఇళ్లలో పని చేసే వారిని కూడా క్షుణ్ణంగా పరీక్షించాకే లోపలకు అనుమతించాలని నిర్ణయించారు. మౌలానా ఆజాద్‌ రోడ్‌ లోని ఉప రాష్ట్రపతి ఇంటి బయట వాహనాల పార్కింగ్‌ ను నిషేధించారు.

  • Loading...

More Telugu News