: ఆనాడు మనకు జరిగింది మామూలు అన్యాయం కాదు: ముఖ్యమంత్రి చంద్రబాబు
హైదరాబాద్‌లో ఉండే అవకాశం 10 ఏళ్లు ఉన్నా మన గడ్డపైనుంచే పాలన కొనసాగిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు అమరావతిలో ఆయన మాట్లాడుతూ... సంవత్సరం ముందు అమరావతి పనులను మొదలు పెట్టామని అన్నారు. పనులను వేగంగా ముందుకు తీసుకెళుతున్నామని చెప్పారు. అమరావతికి భూములిచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు. పనులన్నీ పూర్తయితే అద్భుతమైన ప్రగతిని సాధిస్తామని చంద్రబాబు అన్నారు. ‘ఆనాడు మనకు జరిగింది మామూలు అన్యాయం కాదు, హేతు బద్ధతలేని విభజన జరిగింది. కట్టుబట్టలతో వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఎంతో కోల్పోయాం.. రాజధాని లేదు.. పరిశ్రమలు లేవు.. ఆదాయం వచ్చే పరిస్థితులు లేవు... ఇప్పుడు శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులు పూర్తయితే రాజధానికి ఒక రూపువస్తుంది.. ఇక్కడి నుంచి పరిపాలన చేస్తే ప్రజలకు పాలన సరిగా అందుతుంది.. విభజన సమయంలో అరుణ్‌జైట్లీ మనకు అండగా నిలిచారు. మన రాష్ట్రానికి ఎటువంటి అన్యాయం జరగదు. ఎన్నో కార్యక్రమాల్లో మనకు అరుణ్‌జైట్లీ అండగా నిలుస్తున్నారు’ అని చంద్రబాబు అన్నారు. ‘విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ పోలవరంకు అడ్డు వచ్చే ఏడు మండలాలు మనకు ఇవ్వలేదు.. ఆ రోజు ఆ ఏడు మండలాలు మనకు రాకపోతే ఈ రోజు పోలవరం పనులు ముందుకువెళ్లకపోయేవి. మోదీ సర్కారు మనకు మంచి సహకారాన్ని అందించింది. ఆ ప్రాజెక్టుకి నాబార్డు ద్వారా నిధులు ఇస్తామని ఆర్డరు పాస్ చేశారు. పోలవరం మనకు ఒక వరం’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అన్ని అడ్డంకులను దాటుకొని ముందుకు వెళుతున్నామని చెప్పారు.