: కూతురిని చిత్రహింసలు పెట్టినందుకు తండ్రికి 48 ఏళ్లు, తల్లికి 16 ఏళ్ల జైలు శిక్ష!


బిడ్డపై ఎంతో ప్రేమ‌ను ఒల‌క‌బోస్తూ కంటికి రెప్ప‌లా కాపాడుకుంటుంది అమ్మ. బిడ్డకు భయమేసినపుడు కొండంత ధైర్యాన్ని చెబుతూ రక్షణ కవచంలా ఉంటాడు నాన్న‌. ఇది సహజం. కానీ ఆ అమ్మాయికి క‌న్న త‌ల్లే న‌ర‌కం చూపించింది. ర‌క్ష‌ణ‌గా ఉండాల్సిన తండ్రే ఆ అమ్మాయిని చిత్ర హింస‌లు పెట్టాడు. తాజాగా, ఈ క‌సాయి త‌ల్లిదండ్రుల‌కు సిడ్నీ న్యాయ‌స్థానం తండ్రికి 48 ఏళ్ల జైలు శిక్ష, తల్లికి 16 ఏళ్ల జైలు శిక్ష విధించినట్లు పేర్కొంది. వివ‌రాలు చూస్తే.. ఆస్ట్రేలియాకు చెందిన స‌ద‌రు అమ్మాయి తండ్రికి 59 ఏళ్లు, తల్లికి 51 ఏళ్లు. కూతురిని 15 సంవత్సరాలుగా వేధింపులకు గురిచేశారు. కూతురిని ఐదేళ్ల వయసు వ‌చ్చిన‌ప్పటి నుంచి 20 ఏళ్ల వరకు శారీరకంగా, మానసికంగా చిత్ర‌హింస‌లు పెట్టారు. ఆయుధాలతోనూ బెదిరించేవారు. తండ్రి ఆమెపై లైంగిక దాడి కూడా చేశాడు. అందుకు తల్లి కూడా స‌హ‌కారం అందించింది. బాలికను ప్లాస్టిక్ డబ్బాలో ఉంచడం, చల్లటి నీటిలో తలను ముంచడం, ఎండు మిరపకాయలను తినిపించడం.. వంటి వికృత చేష్టలతో రాక్ష‌సుల్లా ప్ర‌వ‌ర్తించేవారు. చివ‌ర‌కు ఆ అమ్మాయి 20 ఏళ్ల వ‌య‌సు ఉన్న‌ప్పుడు 2011లో తన తల్లిదండ్రులపై ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు విచార‌ణ జ‌రిపి 2013లో వారిని అరెస్టు చేశారు. పూర్తి విచార‌ణ అనంత‌రం సిడ్నీ కోర్టు వారికి ఈ శిక్ష‌ను విధించింది. తండ్రి మొత్తం 73, తల్లి 13 నేరాలు చేసినట్లు తేల్చి చెప్పింది. ఆ అమ్మాయి వయసు ఇప్పుడు 24 సంవత్సరాలు. మానసిక వైద్యశాలలో ప్రస్తుతం ఆమె చికిత్స తీసుకుంటోంది.

  • Loading...

More Telugu News