: కేంద్రానికి సైన్యం జవాబుదారే!: కీలక రూలింగ్ ఇచ్చిన సుప్రీంకోర్టు
భద్రతాదళాలు కేంద్ర ప్రభుత్వానికి, క్యాబినెట్ కు జవాబుదారీగా ఉండాల్సిందేనని సుప్రీంకోర్టు కీలక రూలింగ్ ఇచ్చింది. భారత సైన్యం రాష్ట్రపతికి మాత్రమే సమాధానం చెప్పుకుంటే సరిపోతుందని, సైనిక చర్యలతో ప్రభుత్వాలు రాజకీయ లబ్ధిని పొందాలని చూస్తున్నాయని ఆరోపిస్తూ, కేంద్రానికి, సైన్యం మధ్య జవాబుదారీతనం లేకుండా ఆదేశాలివ్వాలని, సైన్యానికి సంబంధించి నిర్ణయాలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి లేకుండా చూడాలని ఓ పిటిషనర్ కోర్టును ఆశ్రయించగా, ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది. పిటిషన్ ను విచారించిన ధర్మాసనం, ప్రభుత్వానికి సైన్యం సమాధానం చెప్పాల్సిందేనని, లేకుంటే దేశంలో మిలటరీ చట్టాలు అమలవుతున్నట్టేనని అభిప్రాయపడింది. కాగా, సప్టెంబర్ 29 నాటి సర్జికల్ దాడుల తరువాత, వాటిపై రక్షణ మంత్రి పలుమార్లు మీడియా సమావేశాలు నిర్వహించగా, ఈ దాడులను రాజకీయ ప్రయోజనాలకు బీజేపీ వాడుతోందని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో తాను ఇకపై 'దాడి' అన్న పదాన్ని వాడబోనని పారికర్ వ్యాఖ్యానించారు కూడా.