: స్పైస్ జెట్ కుదుపుతో బెంబేలెత్తిన ప్రయాణికులు
సాంకేతిక లోపం కారణంగా స్పైస్ జెట్ విమానం కుదుపులకు లోనుకావడంతో అందులోని ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే... తిరుపతి నుంచి హైదరాబాద్ కు స్పైస్ జెట్ విమానం (ఎస్జీ 1048) నిన్న సాయంత్రం 6.25కు తిరుపతి నుంచి 80 మంది ప్రయాణికులతో బయల్దేరింది. టాకాఫ్ తీసుకున్న కాసేపటికే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో విమానం ఒక్కసారిగా కుదుపుకు గురైంది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 80 మంది ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. సమస్యను గుర్తించిన పైలట్ విమానాన్ని వెనక్కి మళ్లించి, మళ్లీ తిరుపతి విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. దీంతో అంతా హాయిగా ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం ప్రయాణకులకు స్పైస్ జెట్ యాజమాన్యం ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడానికి తోడు, గంటలతరబడి విమానాశ్రయంలో ఎదురుచూసేలా చేయడంతో ఆగ్రహానికి గురైన ఈ విమాన ప్రయాణికులు ఆందోళనకు దిగారు.