: ‘కెప్టెన్ కూల్’కి కోపమొచ్చింది.. ‘రహానె, ఏమైంది నీకు..?’ అంటూ క్రీజులోనే హెచ్చరించిన ధోనీ
‘కెప్టెన్ కూల్’గా పేరు పొందిన మహేంద్రసింగ్ ధోనీకి నిన్న మైదానంలో కోపం వచ్చింది. న్యూజిలాండ్‌తో నిన్న టీమిండియా నాలుగో వన్డే ఆడి ఓడిన సంగతి తెలిసిందే. నిన్నటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 46 ఓవర్లకు ఆరు వికెట్ల నష్టానికి 227 పరుగులు మాత్రమె చేసి కాస్త ఇబ్బందుల్లో పడింది. ఆ సమయంలో టీమిండియా బౌలర్ కులకర్ణి వేసిన బంతిని డెవిసిచ్ మిడ్ వికెట్ దిశగా షాట్ కొట్టి రెండు పరుగులు తీశాడు. అయితే, ఆ సమయంలో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌కు టీమిండియా బౌలర్లు అనవసరంగా మరో పరుగు ఇచ్చారు. రెండో పరుగును న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ దాదాపు పూర్తి చేస్తోన్న సమయంలో టీమిండియా ఫీల్డర్ అక్షర్ పటేల్ బంతిని త్రో ద్వారా బౌలింగ్ ఎండ్‌లో వికెట్లకు అతి దగ్గరగా ఉన్న రహానెకు విసిరాడు. అయితే, ఆ సమయంలో తడబడిన రహానె బంతిని పట్టుకోలేకపోయాడు. అతడిని దాటి బంతి వెనక్కి వెళ్లిపోయింది. దీంతో కివీస్ బ్యాట్స్మెన్లు మరో అదనపు పరుగు తీశారు. దీంతో ధోనికి కోపం వచ్చింది. ‘రహానె, ఏమైంది నీకు..?’ అంటూ కెప్టెన్ కూల్ ఆగ్రహంగా ప్రశ్నించాడు. వికెట్లకి కొంచెం దూరంగా ఉండి బంతిని అందుకోమని హెచ్చరించాడు. ధోని హెచ్చరిస్తోన్న సమయంలో రహానె తాను చేసిన తప్పుకి క్రీజులో అలాగే చూస్తూ ఉండిపోయాడు.