: కారుపై మూత్ర విసర్జన చేసిందని... కుక్కపై నుంచి కారును పోనిచ్చాడు!
మూగ జీవాలపై కొందరు కిరాతకుల అమానుష దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ముంబైలో జరిగిన ఓ ఘటన ఎవరినైనా అయ్యో అనిపించక మానదు. వివరాల్లోకి వెళ్తే సౌరబ్ దుఖాండే అనే వ్యక్తికి చెందిన కారుపై ఓ కుక్క మూత్రం పోసింది. దాన్ని భరించలేక పోయిన అతను... ఆ తర్వాత అది పడుకున్న సమయంలో దానిమీద నుంచి కారుని పోనిచ్చాడు. దీంతో, తీవ్రంగా గాయపడిన ఆ కుక్క నొప్పితో విలవిల్లాడింది. ఈ అమానుష ఘటనను 'ఫీడ్ ఏ స్ట్రే... ఎవ్రీ డే'అనే ఓ ఫేస్ బుక్ పేజ్ వెలుగులోకి తెచ్చింది. దీంతో, ఆ పోస్టు వైరల్ గా మారింది. ఈ ఘటనపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఈ ఫేస్ బుక్ పేజ్ యూజర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఫేస్ బుక్ లో ఈ ఘటన వైరల్ గా మారిన తర్వాత నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని మరో నెటిజన్ వెల్లడించాడు.