: తెలుగింటి ఆడపడుచులకు అండదండ.. ఆరోగ్య భద్రతకు ‘మాస్టర్ హెల్త్ చెకప్’.. బాబు సర్కారు శ్రీకారం
మహిళల ఆరోగ్యంపై చంద్రబాబు సర్కారు ప్రత్యేకంగా దృష్టి సారించింది. వారికి పూర్తి ఆరోగ్య భద్రత కల్పించడంతోపాటు ఆర్థిక సాధికారత కల్పించే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ‘మహిళా మాస్టర్ హెల్త్ చెకప్‘(ఎంఎంహెచ్‌సీ) పథకానికి శ్రీకారం చుట్టింది. అంతేకాదు, సేవలు, తయారీ రంగం, వ్యవసాయం, పర్యాటక రంగాల్లో డ్వాక్రా మహిళలను భాగస్వాములను చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా 181 నంబరు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. ఎంఎంహెచ్ పథకం ద్వారా నాలుగున్నర లక్షల మంది మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. టెక్నాలజీ విషయంలో వైద్య సిబ్బందికి డెల్ సంస్థ సహకారం అందించనుంది. ఇదుకోసం డెల్ ప్రత్యేకంగా డ్యాష్ బోర్డు రూపొందించింది. మహిళా మాస్టర్ హెల్త్ చెకప్‌లో భాగంగా కీలకమైన వైద్య పరీక్షలను మండల, జిల్లా ఆరోగ్య కేంద్రాల్లోనూ నిర్వహించనున్నారు. అంతేకాకుండా 35 ఏళ్లు దాటిన మహిళలకు కేన్సర్, గుండె సంబంధిత వ్యాధులు, శ్వాసకోస సంబంధ వ్యాధులకు సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తారు. డ్వాక్రా మహిళలందరినీ డిజిటల్ లిటరేట్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. సంక్రాంతి నాటికి మొత్తం 54 లక్షల మంది డ్వాక్రా మహిళలకు డిజిటల్ లిటరసీలో శిక్షణ ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. అలాగే వారిని సేవ, తయారీ, వ్యవసాయ, పర్యాటక రంగాల్లో భాగస్వాములను చేయడం ద్వారా వారి కుటుంబ ఆదాయాన్ని గణనీయంగా పెంచే అవకాశం ఉందన్నారు. చంద్రన్న బీమా పథకం కింద ఇంకా 50 లక్షల మంది మహిళలు నమోదు చేసుకోవాల్సి ఉందని, ఆ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.