: ఢిల్లీలోని జేఎన్‌యూలో మరో ఘటన.. అనుమానాస్పదస్థితిలో పీహెచ్‌డీ స్కాలర్ మృతి
వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తోన్న ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఓ పీహెచ్‌డీ స్కాలర్ మృతదేహం లభించడం అలజడి రేపుతోంది. జతుంగ్ ఫీలేమాన్ రాజా అనే స్కాలర్ అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. బ్రహ్మపుత్ర హాస్టల్‌లో ఉన్న ఆయన మృతదేహాన్ని పోలీసులు శవపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే.. గత రెండు రోజుల నుంచి బ్రహ్మపుత్ర హాస్టల్‌లో రాజా గదికి తాళం వేసి కనపడుతోంది. నిన్న సాయంత్రం ఆ గదిలో నుంచి దుర్వాసన రావడాన్ని తోటి విద్యార్థులు గమనించారు. రాజాకు ఫోన్ చేశారు. గదిలోంచి ఫోన్ రింగ్ అవుతున్న శబ్దం వినిపించింది. దీంతో విద్యార్థులు వర్సిటీ భద్రతా సిబ్బంది సాయంతో ఆ గది తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు. అందులో రాజా మృతదేహం ఉండడాన్ని చూసి పోలీసులకి సమాచారం అందించారు. రాజా మణిపూర్‌కి చెందిన పీహెచ్‌డీ స్కాలరని పోలీసులు తెలిపారు. మరోవైపు జేఎన్‌యూలో అదృశ్యమైన నజీబ్ అహ్మద్ ఆచూకీ ఇంతవరకూ తెలియలేదు. ఏబీవీపీతో గొడవపడిన తరువాత ఆ విద్యార్థి కనిపించకుండా పోయాడని వామపక్ష పార్టీకి చెందిన విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. విద్యార్థి అదృశ్యమై 11 రోజులు అవుతోంది. విద్యార్థి ఆచూకీని తెలిపితే రూ.లక్ష ఇస్తామని పోలీసులు ప్రకటించారు.