: ఫ్లిప్ కార్ట్ కు మరో ఎదురుదెబ్బ.. సీఎఫ్ఓ సంజయ్ బవేజా రాజీనామా!
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థ చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ (సీఎఫ్ఓ) సంజయ్ బవేజా ఫ్లిప్ కార్ట్ ను వీడివెళ్లనున్నారు. ఆయన రాజీనామాను ఫ్లిప్ కార్ట్ అధికారికంగా ప్రకటించింది. డిసెంబర్ 31 ఆయన పనిచేసే చివరి రోజని... కొత్త సీఎఫ్ఓను నియమించే కార్యచరణ మొదలయిందని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. కీలకమైన పండుగల సీజన్ లో కంపెనీని ఆయన వదిలి వెళుతుండటం... ఆ సంస్థకు తీరని లోటే. మరో వైపు, అమెరికా రీటైల్ దిగ్గజం వాల్ మార్ట్ నుంచి బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 6600 కోట్లు) పెట్టుబడులను రాబట్టేందుకు యత్నిస్తున్న సమయంలో సంజయ్ బవేజా రాజీనామా చేయడం ఊహించని పరిణామమే. ఈ మధ్య కాలంలో ఫ్లిప్ కార్ట్ నుంచి కీలక అధికారులు వెళ్లిపోయారు. కామర్స్, అడ్వర్టైజింగ్ చీఫ్ ముఖేష్ బన్సల్ ఇప్పటికే రిజైన్ చేశారు. దీనికి తోడు, చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అంకిత్ నగోరి కూడా కూడా సంస్థను వదిలేశారు. వైస్ ప్రెసిడెంట్ మనీష్ మహేశ్వరి, చీఫ్ ప్రాడక్ట్ ఆఫీసర్ పునీత్ సోనీ కూడా గత ఏప్రిల్ లో రాజీనామా చేశారు.