: మద్యం విషయంలో చెరిగిపోయిన హద్దులు.. పురుషులతో సమానంగా పెగ్గేస్తున్న మహిళలు!
మద్యం తాగే విషయంలో హద్దులు చెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు పురుషులకు మాత్రమే పరిమితమైనట్టు ఉన్న ఈ ధోరణిలో క్రమంగా మార్పు వస్తోంది. తాజా అధ్యయనం ప్రకారం మగాళ్లతో పోలిస్తే మహిళలే కొంచెం ఎక్కవగా మద్యం తీసుకుంటున్నట్టు వెల్లడైంది. గతకొన్ని దశాబ్దాలతో పోలిస్తే ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు మహిళలు పురుషులతో సమానంగా పెగ్గేస్తున్నట్టు ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ఐదేళ్ల పాటు నిర్వహించిన ఈ అధ్యయనంలో మద్యం తీసుకునే విషయంలో లింగభేదం క్రమంగా తగ్గిపోయినట్టు వెల్లడైంది. ఇక పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారత్‌లో మద్యం తాగే మహిళల సంఖ్య చాలా తక్కువ. అయితే ఇది నిన్నటి మాట. కానీ ఇప్పుడు ఈ కల్చర్ నగరాల్లో క్రమంగా పెరుగుతోంది. అమెరికాలో 60 శాతం మంది మహిళలు ఏడాదిలో ఓసారైనా మద్యం రుచి చూస్తుండగా భారత్‌లో అది ఐదు శాతంగా ఉంది. మన దేశంలో 40 శాతం మంది పురుషులు, 3 శాతం మంది స్త్రీలు ఏడాదిలో ఓసారైనా మద్యం తీసుకుంటున్నట్టు ఇండియన్ సెంటర్ ఫర్ ఆల్కహాల్ స్టడీస్(ఇన్‌కాస్) అంచనా. నగరంలో ఇది మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. వచ్చే ఐదేళ్లలో మద్యం తాగే మహిళల సంఖ్య 25 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. మహిళలు నేరుగా మద్యం తీసుకోరని, మొదట బ్రీజర్లతో ప్రారంభించి క్రమంగా ఆల్కహాల్ ఎక్కువున్న మద్యం వైపు మొగ్గుచూపుతున్నట్టు మింటెల్ అనే సంస్థ పేర్కొంది.