: ఢిల్లీలో మరో దారుణం...వివాహితను పొడిచి చంపిన ఆటోడ్రైవర్
ఢిల్లీలో మరో దారుణం చోటుచేసుకుంది. తన ప్రేమను అంగీకరించలేదన్న కోపంతో యువతిని నడిరోడ్డుపై ఓ యువకుడు పలుమార్లు కత్తితో పొడిచిన ఘటన మరువకముందే మళ్లీ అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఢిల్లీలోని ఎంజీ రోడ్డు స్టేషన్ వద్ద రోడ్డుపై నడుస్తున్న పింకీ దేవి (34) అనే మహిళను గత కొంత కాలంగా వేధిస్తున్న ఆటోడ్రైవర్ జితేందర్ వెంబడించడం మొదలుపెట్టాడు. అతని వేధింపులపై గతంలో భర్త మాన్ సింగ్ కు ఫిర్యాదు చేసిన పింకీ దేవి, అతను వెంబడిస్తున్న విషయం తన భర్తకు తెలిపేందుకు ఫోన్ చేసింది. అతనితో మాట్లాడుతుండగానే ఆమెను సమీపించిన జితేందర్ ఆమెను పలుమార్లు విచక్షణా రహితంగా కత్తితో పొడిచాడు. సమాచారం అందుకున్న కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సిబ్బంది వెంటనే నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. రక్తపు మడుగులో పడి ఉన్న పింకీ దేవిని స్థానిక ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆమె మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించామని అన్నారు.