: పేరు మార్చుకుంటే ఐఫోన్‌ను ఉచితంగా ఇచ్చేస్తారట!
ఎలక్ట్రానిక్ వస్తువులను ఉత్పత్తి చేసే దిగ్గజ కంపెనీ యాపిల్ ప్రతిష్టాత్మకంగా మార్కెట్‌లో ఆవిష్కరించిన ఐఫోన్-7ని తమ సొంతం చేసుకోవాలని ఎంతో మంది స్మార్ట్ ఫోన్ ప్రియులు ఆరాటపడుతుంటారు. అయితే, దాని ధర అధికంగా ఉండడంతో కొందరికి అది అందకుండానే పోతోంది. అయితే, ఐఫోన్ 7 కోసం వేచిచూస్తున్న వినియోగదారులకు ఉక్రెయిన్‌లోనే అతిపెద్ద మొబైల్ రిటైల్ వెబ్‌సైట్‌లో ఒకటైన ‘అల్లో.యూఏ’ శుభవార్త అందించింది. వేలల్లో డబ్బులు పెట్టి కొనే అవసరం లేకుండా ఐఫోన్-7ని ఉచితంగా సొంతం చేసుకోవచ్చని ప్రకటించింది. అయితే, అందుకో విచిత్రమైన షరతు పెట్టింది. ఐఫోన్-7 తమ కస్టమర్లు ఉచితంగా సొంతం చేసుకోవచ్చని, అయితే, అందుకోసం వారు తమ పేరుని ఐఫోన్-7గా మార్చుకోవాలని ఓ ఆఫర్ ప్రకటించింది. ఈ షరతు ప్రకారం వినియోగదారుడు తన పేరుకు బదులుగా మొదటి పేరుని ఐఫోన్ అని, రెండో పేరుని 7 అని మార్చుకోవాలి. ఇందుకోసం పేరు మార్చుకున్న వ్యక్తి తనకు సర్కారు ఆమోదముద్రతో ఇచ్చిన ధ్రువీకరణ పత్రంతో సెల్ఫీ దిగి దాన్ని ‘అల్లో.యూఏ’ సంస్థకు పంపాలని పేర్కొంది. తమకు అలా పేరు మార్చుకొని పంపిన దరఖాస్తుల్లో మొదట పంపిన ఐదుగురిని విజేతలుగా వెబ్‌సైట్లో ప్రకటిస్తామని చెప్పింది. వారికి 32 జీబీ మెమరీ ఉండే ఐఫోన్-7 ఉచితంగా ఇస్తామని పేర్కొంది. ఈ ఆఫర్ ను 2016 అక్టోబర్ 17 నుంచి వచ్చే ఏడాది మార్చి 1 వరకు అందుబాటులో ఉంచుతున్నట్లు ఆ సంస్థ తెలిపింది. ఫ్రీగా ఈ స్మార్టు ఫోనుని పొందాలంటే అందుకోసం ముందుగా ఉక్రెయిన్‌లోని స్థానిక రిజిస్ట్రారు కార్యాలయంలో ఆ ఫోను కావాలనుకుంటున్న వారు తమ పేరుని మార్చుకోవాలి.