: వేరు కుంపటిపై నేడు నిర్ణయం తీసుకోనున్న యూపీ సీఎం అఖిలేష్!
ములాయం సింగ్ యాదవ్ నేతృత్వంలో ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉత్తరప్రదేశ్ లో పాలన సాగిస్తున్న సమాజ్ వాదీ పార్టీలో చీలిక ఖాయమని తెలుస్తోంది. తండ్రి, బాబాయ్ లను విభేదిస్తున్న అఖిలేష్ కొత్త పార్టీ పెట్టుకోవాలన్న ఆలోచనతో, తన వర్గంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మరికాసేపట్లో ఆయన సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో కొత్త పార్టీపై కీలక నిర్ణయం తీసుకోనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ సమావేశానికి తన అనుయాయులను మాత్రమే ఆహ్వానించిన అఖిలేష్, శివపాల్ వర్గంలోని వారిని పిలవలేదు. మొత్తం 300 మంది ఎంఎల్ఏలు, ఎమ్మెల్సీలు ఉన్న సమాజ్ వాదీ పార్టీలో 175 మందికి ఫోన్ చేసి ఈ సమావేశానికి హాజరు కావాలని అఖిలేష్ వర్గంలోని ముఖ్య నేతలు కోరారు. ఇక ఇదే సమావేశంపై శివపాల్ వర్గం స్పందిస్తూ, ఎమ్మెల్యేలతో ఎలాంటి అధికారిక సమావేశమూ నేడు జరగడం లేదని, ఎవరైనా కొందరు కలిస్తే, అది ప్రైవేటు సమావేశమేనని వ్యాఖ్యానించింది. పార్టీ సుప్రీమో ములాయంను ధిక్కరించే ఉద్దేశం అత్యధిక ఎమ్మెల్యేలకు లేదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో నేటి అఖిలేష్ సమావేశం ఎలా జరుగుతుందన్న అనుమానాలు పెరుగుతున్నాయి.