: ఇరాక్ పార్లమెంట్ సంచలన నిర్ణయం.. మద్య నిషేధానికి అనుకూలంగా ఓటు


ఇరాక్ పార్లమెంటు సంచలన నిర్ణయం తీసుకుంది. మద్యనిషేధానికి అనుకూలంగా శనివారం పార్లమెంటు ఓటేసింది. తాజా నిర్ణయం ప్రకారం మద్యం విక్రయాలు కానీ, దిగుమతి కానీ, ఉత్పత్తి కాని ఉండదు. మైనారిటీలను సంతృప్తి పరచడంతోపాటు మత పార్టీలను ప్రసన్నం చేసుకునేందుకే ఇరాక్ పార్లమెంటు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ నిర్ణయంపై కొందరు ఆనందం వ్యక్తం చేస్తుండగా మరికొందరు మాత్రం పెదవి విరుస్తున్నారు. ప్రతిపక్షాలు మాత్రం ఇది రాజ్యాంగ ఉల్లంఘన కిందకి వస్తుందని చెబుతున్నారు. ఆర్టికల్ 14 ప్రకారం మద్య నిషేధ చట్టానికి ఆమోదం లభించిందని సీనియర్ క్రిస్టియన్ ఎంపీ యోనడమ్ కన్న తెలిపారు. తాజా చట్ట ప్రకారం మద్యాన్ని దిగుమతి చేసుకోవడం, ఉత్పత్తి చేయడం, విక్రయించడంపై నిషేధం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. చట్టాన్ని ఉల్లంఘించే వారికి 10-25 మిలియన్ దినార్ల(దాదాపు 8వేల డాలర్లు) వరకు జరిమానా విధించనున్నట్టు ఆయన వివరించారు. ఇరాక్‌లోని రెస్టారెంట్లు, హోటళ్లలో చాలా అరుదుగా మద్యాన్ని విక్రయిస్తుంటారు. ఇటీవల మద్యం విక్రయాలు విపరీతంగా పెరిగాయి. ముఖ్యంగా బాగ్దాద్‌లో అయితే చిన్నచిన్న షాపుల్లో పెట్టి మరీ మద్యాన్ని యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. దీంతో కళ్లు తెరిచిన ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.

  • Loading...

More Telugu News