: 5 కోట్లు ఇస్తే తప్పు ఒప్పైపోతుందా?...ఠాక్రేను నిలదీసిన ఆర్మీ!: ఆర్మీ అధికారులు


'ఏ దిల్ హై ముష్కిల్' వివాదంలోకి తమను లాగొద్దని సైన్యం తేల్చిచెప్పింది. పాక్ నటీనటులను సినిమాలో పెట్టుకున్నందుకు గాను సైన్యం సహాయనిధికి 5 కోట్లరూపాయల విరాళం ఇవ్వాలంటూ నిర్మాతలకు మహారాష్ట్ర నవనిర్మాణ సేన షరతు విధించడం సహేతుకం కాదని ఆర్మీ అధికారులు స్పష్టం చేశారు. చర్చల అనంతరం 'ఏ దిల్ హై ముష్కిల్' వివాదం సమసిపోవడంతో దీనిపై పలువురు సైన్యాధికారులు తమ అభిప్రాయాలు స్పష్టం చేశారు. జాతి సెంటిమెంట్లను ఇలా వాడుకోకూడదని, ఏదైనా తప్పయితే దాన్ని తప్పనే అనాలి తప్ప, బలవంతంగా 5 కోట్ల రూపాయలు విరాళం ఇప్పించినంత మాత్రాన తప్పు ఒప్పయిపోదని కార్గిల్ యుద్ధ హీరో, బ్రిగేడియర్ కుషాల్ ఠాకూర్ (రిటైర్డ్) స్పష్టం చేశారు. 'నిధుల కోసం ఆర్మీ వాళ్ల దగ్గరకు, వీళ్ల దగ్గరకు ఎప్పుడూ వెళ్లదని, సినీనిర్మాతలెవరైనా విరాళాలివ్వాలనుకుంటే ఇవ్వచ్చని, అంతేకానీ ఇలా బలవంతంగా విరాళాలు వసూలు చేయకూడదని' మరో ఆర్మీ అధికారి తెలిపారు. ఆర్మీని రాజకీయాలకు దూరంగా ఉంచాలని ఆయన స్పష్టం చేశారు. విరాళం ఎవరిచ్చినా పర్లేదు కానీ, ఇలా బలవంతంగా ఇప్పించిన డబ్బును తాము స్వీకరించేది లేదని మరో సీనియర్ అధికారి చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఆర్మీ పేరును వాడుకోకూడదని మరో అధికారి సూచించారు. దేశభక్తిని చూపించేందుకు, ఆర్మీ అమరవీరులను ఆదుకునేందుకు పలు సంస్థలు, పలువురు వ్యక్తులు రక్షణ మంత్రిత్వశాఖను కోరడంతో ఆర్మీ సంక్షేమ నిధి పేరుతో కేంద్ర ప్రభుత్వం ఒక బ్యాంకు ఖాతాను ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News