: విందులో కూడా హిల్లరీని వదలని ట్రంప్... ఆఖరున షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు


డొనాల్డ్ ట్రంప్ తిట్టినన్ని తిట్లు హిల్లరీ క్లింటన్ ను జీవితంలో ఎవరూ తిట్టి ఉండరు. అధ్యక్ష అభ్యర్థులుగా ట్రంప్, హిల్లరీ ఖరారైన నాటి నుంచి ట్రంప్ ఆమెను తిడుతూనే ఉన్నారు. గతంలో ఫైనల్ ప్రెసిడెన్సియల్ డిబేట్ తో అమెరికా అధ్యక్షుడు ఎవరు? అన్నది ఇంచుమించు ఖరారైపోయేది. నవంబర్ 8న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనుండడంతో ఈ దఫా ఎవరు అన్నది ఇంకా తేలాల్సి ఉంది. అయితే డిబేట్ల ద్వారా హిల్లరీ నైతిక విజయం సాధించారు. ఈ క్రమంలో ఫైనల్ బిగ్ డిబేట్ అనంతరం మరోసారి వారిద్దరూ కలుసుకున్నారు. అమెరికాలోని క్యాథలిక్ ప్రముఖులు ప్రతి ఏడాది అక్టోబర్ మూడో గురువారం న్యూయార్క్ లో నిర్వహించే ఆల్ఫ్రెడ్ స్మిత్ మెమోరియల్ ఫౌండేషన్ డిన్నర్ కార్యక్రమానికి రాజకీయ ప్రముఖులు హాజరుకావడం ఆనవాయతి. ఇందులో ట్రంప్, హిల్లరీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కూడా ట్రంప్ ఆమెను వదల్లేదు. 'ఫ్రెండ్స్! ఇక్కడ సుమారు 1000 మంది ప్రముఖులున్నారు. బహుశా హిల్లరీ క్లింటన్ పాల్గొన్న అన్ని సభల్లోకి ఎక్కువ జనం వచ్చింది ఇక్కడికే కావచ్చు! ఇంతకీ ఆమెను ఈ డిన్నర్ కు ఎలా ఆహ్వానించారు? ఈ-మెయిల్ కబురు పెడితేనే తప్ప, మామూలుగా పిలిస్తే ఆవిడ రారు కదా!...చివరికి ఆ మెయిల్ కూడా ఏ వికీలీక్స్ లోనో కనబడితే తప్ప ఆమె స్పందించరు' అంటూ 'హిల్లరీ ఈ మెయిల్స్' ఉదంతాన్ని దెప్పిపొడుస్తూ ట్రంప్ వ్యాఖ్యానించడంతో హిల్లరీ సైతం నవ్వేశారు. అధ్యక్షురాలైతే 'హిల్లరీ నన్ను ఇరాక్ లేదా అఫ్ఘానిస్థాన్ అంబాసిడర్(రాయబారి)గా నియమించాలనుకుంటున్నారు. అఫ్ కోర్స్ ఆ పదవి స్వీకరించాలా? వద్దా? అనేది నా నిర్ణయమే అనుకోండి' అని వ్యాఖ్యానించారు. విందు ముగిసిన అనంతరం వీరిద్దరూ కరచాలనం చేసుకోవడం విశేషం. ఫైనల్ బిగ్ డిబేట్ లో వీరిద్దరూ పలకరించుకోలేదు సరికదా, కనీసం ఒకర్నొకరు చూసుకునే ప్రయత్నం కూడా చేయకపోవడం విశేషం.

  • Loading...

More Telugu News