: ఉగ్రవాదిగా మారబోయిన యువకుడే ఇప్పుడు 'పోస్టర్ బాయ్'... మనసు మార్చి అతనిని ప్రచారానికి వాడుకుంటున్న ముంబై పోలీసులు
ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల్లో చేరుతున్న యువతను నిలువరించేందుకు ప్రత్యేక ప్రచారం చేపట్టాలని నిర్ణయించిన మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్, అందుకు 20 ఏళ్ల కేరళ ముస్లిం యువకుడిని 'పోస్టర్ బాయ్'గా ఎంపిక చేసింది. ప్రస్తుతం సెంట్రల్ ముంబై కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్న ఈ యువకుడితో డాక్యుమెంటరీలు తీయడం ద్వారా, ఐఎస్ మత్తులో పడిన యువత ఎలాంటి ఇబ్బందులు పడుతుందన్న అంశాలతో తీసే లఘు చిత్రాలను ఇంటర్నెట్ లో పాప్యులర్ చేయాలన్నది ముంబై పోలీసుల ఉద్దేశం. ఇంటర్నెట్ ను వాడుకుంటూ ఉగ్రవాదులు యువత మనసులను ఎలా పాడు చేస్తున్నదీ ఇతనితో చెప్పిస్తామని పోలీసు వర్గాలు వెల్లడించాయి. వాస్తవానికి యమన్, సిరియా, పారిస్ తదితర ప్రాంతాల్లో ఉగ్రదాడులను ఖండిస్తూ ఈ యువకుడు సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న ప్రచారం చూసి అతన్నే పోస్టర్ బాయ్ గా ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రపంచ దేశాల అధినేతలు చేసే ఉగ్ర వ్యతిరేక వ్యాఖ్యలను ఈ యువకుడు ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటుంటాడు కూడా. అంతకుముందు ఇదే యువకుడికి ఐఎస్ఐఎస్ వల వేసింది కూడా. ఇతన్ని ఉగ్ర సానుభూతి పరుడిగా మార్చాలని జరుగుతున్న కుట్రను ముందుగానే గమనించిన ముంబై పోలీసులు అతని మనసును మార్చడంలో విజయవంతమయ్యారు. ఓ కెనడా మహిళ ఇతన్ని సిరియాకు రమ్మని, అక్కడ ఇద్దరమూ కలసి జీవించవచ్చని ఆశ పెట్టింది కూడా. ఇది గమనించిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అధికారులు ఇద్దరు సైకియార్టిస్టులు, అతని తల్లి, ఓ డాక్టర్, ఓ మౌలానా, ఐదుగురు స్నేహితులతో కూడిన ఓ కమిటీని నియమించి, అతనికి ఇస్లాం అంటే నిజమైన అర్థం చెప్పించి తిరిగి చదువులో మనసు నిమగ్నం చేసేలా చూడటంలో విజయవంతమయ్యారు. ఇప్పుడు అతన్నే ఉపయోగించి ఇతరులను మార్చాలని చేస్తున్న ప్రయత్నాలూ విజయవంతం కావాలని ఆశిద్దాం.