: అఖిలేష్ పై చేతబడి చేయిస్తున్న ములాయం రెండో భార్య సాధన... సంచలనం కలిగిస్తున్న ఉదయ్ వీర్ లేఖ!
ముఖ్యమంత్రిగా అఖిలేష్ ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్న సమాజ్ వాదీ పార్టీ సుప్రీమో ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య సాధన, శివపాల్ యాదవ్ తో కలసి చేతబడులు చేయిస్తున్నారని ఎమ్మెల్సీ ఉదయ్ వీర్ సింగ్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ములాయంకు ఓ లేఖను రాశారు. తక్షణమే ములాయం పార్టీ అధ్యక్ష పదవిని అఖిలేష్ కు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. లేఖలోని అభిప్రాయాలు తన వ్యక్తిగతమేనని అంటూనే, పార్టీలోని అత్యధికుల అభిప్రాయం కూడా ఇదేనని ఆయన పేర్కొనడం గమనార్హం. సొంత కొడుకులా చూసుకోవాల్సిన అఖిలేష్ పై సాధన కుట్రలు చేస్తున్నారని ఆరోపిస్తూ, పార్టీలోని సీనియర్లను పక్కనబెట్టి యువరక్తంతో నింపాలని, అందుకు అఖిలేష్ మాత్రమే ప్రత్యామ్నాయమని తెలిపారు. ఈ లేఖపై సమాజ్ వాదీ నేత అషూ మాలిక్ తీవ్రంగా స్పందించారు. ఈ తరహా లేఖలతో కనీసం 500 ఓట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. పార్టీలో క్రమశిక్షణను మీరితే సహించేది లేదని, నేతాజీని అగౌరవపరిచే ఏ వ్యాఖ్యలనూ క్షమించబోమని హెచ్చరించారు.