: కర్ణాటక గవర్నర్ పేరు పలకడానికి ముఖ్యమంత్రి పాట్లు!
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆ రాష్ట్ర గవర్నర్ పేరుతో చాలా ఇబ్బంది పడ్డ ఘటన బెంగళూరు రాజ్ భవన్ లో చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా బెంగళూరులోని రాజ్ భవన్ లో ఉత్తమ పోలీసు అధికారులుగా ఎంపికైన వారికి పతకాల ప్రదానం జరిగింది. ఈ కార్యక్రమంలో గవర్నర్ వాజుభాయ్ రూడ్ భాయ్ వాలాతో పాటు ముఖ్యమంత్రి సిద్దరామయ్య, హోం మంత్రి పరమేశ్వర్, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆ కార్యక్రమానికి హాజరైన పోలీసు అధికారులనుద్దేశించి సిద్దరామయ్య మాట్లాడుతూ, గవర్నర్ కు ధన్యవాదాలు చెప్పడంలో భాగంగా ఆయన పేరు పలకడంలో తీవ్రంగా ఇబ్బంది పడి ఆయనను గవర్నర్ రూడ్ వాలా అన్నారు. మరో రెండుసార్లు ప్రయత్నించినా ఆయన పేరు చెప్పడంలో ఇబ్బంది పడ్డ ఆయన, చివరకు ఆహ్వాన పత్రం తెప్పించుకుని దానిని చూసి చదివారు. అది కూడా కాస్త ఇబ్బందిగానే! గుజరాత్ కు చెందిన వాజుభాయ్ వాలాను కర్ణాటక గవర్నర్ గా కేంద్రం నియమించిన సంగతి తెలిసిందే.