: తన ప్రచారకర్త మాటను పెడచెవిన పెట్టి.. అధ్యక్ష పీఠానికి దూరమౌతున్న ట్రంప్!
గడచిన రెండు, మూడు వారాల్లో జరిగిన పరిణామాలు రిపబ్లికన్ల తరఫున అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ ను వైట్ హౌస్ కు ఒక్కో మెట్టూ దూరం చేశాయి. తనపై వచ్చిన విమర్శలు, పాత వీడియోలు, సంభాషణలు ఆయన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే, ఎవరిని అనాలో, ఏమనాలో తెలియని ట్రంప్, ఓ వైపు క్షమాపణలు చెబుతూనే, మరోవైపు మీడియా తనకు వ్యతిరేకంగా మారిపోయి, ఎన్నికలను ప్రభావితం చేస్తోందని విరుచుకుపడ్డారు. ఇక ప్రసార మాధ్యమాలను దూరం చేసుకోవద్దని, మీడియాకు ఎంత దగ్గరగా ఉంటే ప్రజల్లోకి అంత సులువుగా దూసుకెళ్లచ్చని ట్రంప్ ప్రచార విభాగం చీఫ్ స్టీవ్ బానన్ ఏనాడో సలహా ఇచ్చినప్పటికీ, ట్రంప్ దాన్ని పెడచెవిన పెట్టినట్టు తెలుస్తోంది. "ట్రంప్ నోటి వెంట మీడియా మనకు వ్యతిరేకం అన్న పదం రానే రాకూడదు. ఆ మాట వస్తే ఓటమిని అంగీకరించినట్టే" అని స్టీవ్ బానన్ చెప్పిన మాటల రికార్డు వెలుగులోకి వచ్చింది. కన్సర్వేటివ్ రేడియో ఫోరమ్ లో ఆయన మాట్లాడిన మాటలను పరిశీలిస్తే, మీడియా 1960 దశకం నుంచే రిపబ్లికన్లకు వ్యతిరేకంగా మారిపోయిందని, రోనాల్డ్ రీగన్, రిచర్డ్ నిక్సన్ లు ఈ సమస్యను అధిగమించారని ఆయన గుర్తు చేశారు. ట్రంప్ సైతం మీడియా వ్యతిరేకతను జయిస్తేనే విజయం వైపు అడుగులేస్తారని సలహా ఇచ్చారు. దాన్ని పాటించని ట్రంప్, మీడియాకు దూరమై, నిత్యమూ ఏదో ఒక ఆరోపణల్లో చిక్కుకుంటుండగా, ఎన్నికలకు మూడు వారాల సమయం కూడా లేని ఈ పరిస్థితుల్లో తిరిగి మీడియాను దారికి తెచ్చుకోవడం దాదాపు అసాధ్యమే. అంటే, పరిస్థితి ట్రంప్ చేయిదాటినట్టే!