: భారత్, చైనాలు దూసుకెళ్తున్నాయి...అమెరికా వెనకబడిపోయింది: ట్రంప్
జీడీపీలో భారత్ 8 శాతం వృద్ధి నమోదు చేస్తూ అభివృద్ధి దిశగా దూసుకుపోతోందని అమెరికా రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. లాస్ వెగాస్ లో జరిగిన ఫైనల్ డిబేట్ లో ఆయన మాట్లాడుతూ, భారత్ బాటలోనే చైనా 6 శాతం జీడీపీ వృద్ధితో దూసుకుపోతోందని అన్నారు. అదే సమయంలో అమెరికా మాత్రం కేవలం 1 శాతం లేదా అంతకంటే తక్కువ శాతం జీడీపీ వృద్ధిరేటుతో వెనకబడిపోయిందని ట్రంప్ ఆరోపించారు. ఇలాగే అమెరికా విధానాలు కొనసాగితే దేశం ప్రమాదంలో పడుతుందని అన్నారు. ఇలాంటి విధానాలు సరికాదని, తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే అమెరికా జీడీపీ కొత్త పుంతలు తొక్కుతుందని ఆయన అన్నారు. దీనికి సమాధానం ఇచ్చిన హిల్లరీ మాట్లాడుతూ, చైనా అభివృద్ధికి ఎవరు కారణం? అని ప్రశ్నించారు. చైనా నుంచి అవసరాలకు మించి ఇనుము, అల్యూమినియం తెచ్చుకుని హోటల్ నిర్మించిన చరిత్ర కలిగిన ట్రంప్ అమెరికాపై అంతులేని అభిమానం వ్యక్తం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అదే సమయంలో ట్రంప్ కంపెనీల్లో చైనా ఉద్యోగులు ఎంత మంది ఉన్నారో బయటపెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. ట్రంప్ కంపెనీల్లో అమెరికన్ల కంటే చైనీయులే ఎక్కువ మంది పనిచేస్తున్నారని ఆమె ఆరోపించారు. ముందు ట్రంప్ కంపెనీల్లో అమెరికన్లకు ఉపాధి కల్పించాలని సూచించారు. విద్యావిధానాలను బలోపేతం చేయడం ద్వారా నాణ్యమైన గ్రాడ్యుయేట్లను ఉత్పత్తి చేసి, జీడీపీలో గణనీయమైన వృద్ధిరేటును సాధిస్తామని ఆమె స్పష్టం చేశారు.