: సోషల్ మీడియాలో భారతీయులు ఎంత అరిచినా ఉపయోగం లేదు...మా వస్తువులు వాడాల్సిందే: చైనా మీడియా


యూరీ ఉగ్రదాడి అనంతరం పాక్ ను అన్ని రకాలుగా వెనకేసుకుని వస్తున్న చైనా మీడియా భారతీయులను తీవ్రంగా అవమానిస్తోంది. చైనా వస్తువులను బహిష్కరించడం ద్వారా ఆ దేశానికి బుద్ధి చెప్పాలని భావించిన కొందరు సోషల్ మీడియా చైనా వస్తువులను బహిష్కరించాలంటూ పిలుపునిస్తున్న సంగతి తెలిసిందే. దీనిని చైనా మీడియా ఎద్దేవా చేసింది. భారతీయులు చైనా వస్తువులను బాయ్‌ కాట్ చేయాలని పిలుపునిచ్చే కొద్దీ చైనా వస్తువులకు మద్దతు పెరుగుతోందని చైనా మీడియా చెబుతోంది. దీనికి తోడు భారతీయ మార్కెట్‌ పై చైనా వస్తువులకు తిరుగులేని ఆధిపత్యం ఉందని చెబుతోంది. సోషల్ మీడియాలో భారతీయుల ప్రచారం విజయవంతం కాదని తేల్చిచెప్పింది. భారత్ లో చైనా వస్తువులను ఢీ కొట్టగల ఉత్పత్తులు లేవని స్పష్టం చేసింది. ఇప్పట్లో భారత్ తమ స్థాయికి చేరుకోలేదని, అలా చేరుకోవాలంటే చాలా కాలం పడుతుందని, అంత వరకు భారతీయ మార్కెట్ లో చైనా ఉత్పత్తుల అమ్మకాలను ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేసింది. భారతీయులవి ఉత్తుత్తి అరుపులేనని, అవి తమనేమీ చేయలేవంటూ ‘గ్లోబల్ టైమ్స్’ పత్రిక స్పష్టం చేసింది. అంతే కాకుండా చైనా వాణిజ్యాన్ని అడ్డుకునే సత్తా భారత్‌ కు లేదని తెలిపింది. చైనా వస్తువులను తట్టుకుని నిలబడగలిగే వస్తువులను భారత్ ఉత్పత్తి చేయలేదని గర్వంగా ప్రకటించింది. చైనా వస్తువుల పట్ల భారతీయులను ఆకట్టుకోవడం వెనుక ధరలు, వేరియంట్లు వంటి చాలా కారణాలు ఉన్నాయని, సాంకేతిక ప్రమాణాల్లో కూడా భారత్ తమకు సాటి రాదని, దీంతో తమకంటే చాలా విషయాల్లో వెనకబడి ఉన్న భారతదేశం తమ ఉత్పత్తులను అడ్డుకోలేదని తెలిపింది. రహదారులు, విద్యుత్ వ్యవస్థ, నీటి సరఫరా సరిగా లేవని, ముందు వాటి సంగతి చూసుకోవాలని సలహా పారేసింది. అంతే కాకుండా భారత్ లోని ప్రతి ప్రభుత్వ విభాగంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని పేర్కొంది. ప్రభుత్వ వర్గాల్లో పెరిగిన అవినీతితో అభివృద్ధి అనేది ఆ దేశానికి అందని ద్రాక్షగానే మిగులుతుందని తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ‘మేకిన్ ఇండియా’ కూడా శుద్ధ దండగ కార్యక్రమమని తెలిపింది. భారత్‌ లో చైనా కంపెనీలు దుకాణాలు ప్రారంభించడం కంటే చైనాలో మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలు స్థాపించుకుని, ఎగుమతి చేయడమే ఉత్తమమని సూచించింది.

  • Loading...

More Telugu News