: 'ఏ దిల్ హై ముష్కిల్' ప్రదర్శిస్తే పరిణామాలు ఎదుర్కోవాల్సిందే... మరోసారి హెచ్చరించిన ఎమ్మెన్నెస్
తమ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ 'ఏ దిల్ హై ముష్కిల్'ను మల్టీప్లెక్స్ థియేటర్లలో ప్రదర్శిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనాల్సి ఉంటుందని మహారాష్ట్ర నవనిర్మాణ సేన నేత అమేయ్ ఖోప్కర్ మరోసారి హెచ్చరించారు. పాకిస్థాన్ నటులు నటించిన ఈ సినిమాను ప్రదర్శించినా, ఈ సినిమాకు వ్యతిరేకంగా తాము నిర్వహించే ప్రదర్శనను అడ్డుకోవాలని ప్రయత్నించినా, సినిమా ప్రదర్శన ఆపేందుకు తమ కార్యకర్తలు చేసిన ప్రయత్నాలను అడ్డుకున్నా తీవ్ర పరిణామాలు తప్పవని వారు హెచ్చరించారు. తమ వినతిని మన్నించకపోతే సినిమాల విడుదల విషయంలో ఎమ్మెన్నెస్ ఏం చేయగలదో సినీ నిర్మాతలు తెలుసుకుంటారని ఆ పార్టీ నేత షాలినీ ఠాక్రే హెచ్చరించారు. ఈ సినిమా విడుదల విషయంలో బాలీవుడ్ ప్రముఖులు దర్శకుడు, నిర్మాత కరణ్ జొహార్ పక్షాన నిలిచారు. అయితే నాలుగు రాష్ట్రాల్లోని సింగిల్ ధియేటర్ ఓనర్లు ఈ సినిమాను ప్రదర్శించమని తీర్మానించడం జరిగింది. దీనికి తోడు మహారాష్ట్రలో ఎమ్మెన్నెస్, హైదరాబాదులో రాజాసింగ్, బెంగళూరులో బీజేపీ మద్దతుదారులు ఈ సినిమాను అడ్డుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదల తీవ్ర గందరగోళంలో పడింది.