: ఒలింపిక్స్ తరువాత సింధూకు అతిపెద్ద పరీక్ష!
ఒలింపిక్స్ లో రజత పతకం సాధించి భారత కీర్తి ప్రతిష్ఠలను అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడించిన పీవీ సింధు దాదాపు రెండు నెలల విరామం తరువాత మళ్లీ రాకెట్ పట్టింది. నేటి నుంచి డెన్మార్క్ ఓపెన్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నీ జరుగుతుండగా, సింధూ ఐదో సీడ్ గా బరిలోకి దిగింది. డ్రా పరంగా సింధూకు కొంత క్లిష్టతరమైన పరిస్థితే కనిపిస్తోంది. చైనాకు చెందిన బింగ్జియావొ, రెండో సీడ్, థాయ్ లాండ్ క్రీడాకారిణి ఇంతానన్ రచనోక్, కొరియాకు చెందిన నాలుగో సీడ్ సుంగ్ హ్యున్, చైనీస్ తైపీ స్టార్ యింగ్ తైజు తదితరులు సింధుకు ప్రత్యర్థులుగా వచ్చే అవకాశాలున్నాయి. ఒలింపిక్స్ తరువాత సింధూ ఆడుతున్న టోర్నీ ఇదేకాగా, చీలమండ గాయంతో బాధపడుతున్న కిదాంబి శ్రీకాంత్, మోకాలి గాయంతో సైనా నెహ్వాల్ ఈ టోర్నీలో పాల్గొనడం లేదు. ఇదే సమయంలో పురుషుల విభాగంలో రౌల్ మస్త్ (ఎస్తోనియా) తో పారుపల్లి కశ్యప్, తనోంగ్సక్ (థాయ్‌లాండ్) తో సాయిప్రణీత్, పోన్సానా (థాయ్‌లాండ్) తో అజయ్ జయరాంలు తొలి రౌండ్ పోటీల్లో భాగంగా తలపడనున్నారు.