: తీసుకున్న జీతం మొత్తం తిరిగి ఇవ్వాల్సిందే: టీడీపీ నేత శత్రుచర్లకు వ్యతిరేకంగా హైకోర్టు తీర్పు
క్షత్రియుడై ఉండి ఎస్టీలకు రిజర్వ్ అయిన నాగూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఐదేళ్ల పాటు తీసుకున్న వేతనమంతా శత్రుచర్ల విజయరామరాజు చెల్లించాల్సిందేనని హైకోర్టు కీలక తీర్పిచ్చింది. 1999 నుంచి 2004 వరకూ శ్రీకాకుళం జిల్లా నాగూరు ఎమ్మెల్యేగా శత్రుచర్ల కొనసాగిన సంగతి తెలిసిందే. ఆయన ఎస్టీ కాదని ఆరోపిస్తూ, నిమ్మక జయరాజు కోర్టును ఆశ్రయించగా, ఆయన ఎస్టీ కాదని సెషన్స్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకూ తేల్చాయి. ఆయన ఎన్నిక చెల్లదని పదవీ కాలం ముగిసిన తరువాత తీర్పు వచ్చింది. అయితే, ఆయన ఎమ్మెల్యేగా తీసుకున్న వేతనం మాటేమిటని హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు కాగా, తప్పుడు వివరాలు సమర్పించి ఎన్నికైన వారు, ఖజానా నుంచి పొందిన వేతనాలను తిరిగి చెల్లించాల్సిందేనని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. శత్రుచర్ల తాను తీసుకున్న వేతనం మొత్తాన్ని వెనక్కు ఇవ్వాలని తీర్పిచ్చింది. కాగా, 2014 ఎన్నికల్లో పాతపట్నం నుంచి పోటీ చేసిన శత్రుచర్ల, వైకాపా అధ్యర్థి రమణమూర్తి చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.