: సెంటిమెంట్ నశించి నష్టాల్లోకి జారిపోయిన స్టాక్ మార్కెట్
సెషన్ ఆరంభంలో లాభాల్లో ఉన్న భారత స్టాక్ మార్కెట్, ఆపై విదేశాల నుంచి అందిన సంకేతాలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ నశించగా, నష్టాల్లోకి జారిపోయింది. ఆసియా మార్కెట్ల అనిశ్చితి, యూరప్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి సెన్సెక్స్, నిఫ్టీలపై కనిపించిందని నిపుణులు వ్యాఖ్యానించారు. సోమవారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 143.63 పాయింట్లు పడిపోయి 0.52 శాతం నష్టంతో 27,529.97 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ 63 పాయింట్లు పడిపోయి 0.73 శాతం లాభంతో 8,583.40 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ కాప్ 0.95 శాతం, స్మాల్ కాప్ 0.52 శాతం నష్టపోయాయి. ఇక ఎన్ఎస్ఈ-50లో 7 కంపెనీలు మాత్రమే లాభపడ్డాయి. ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్టీపీసీ, హిందుస్థాన్ యూనీలివర్, ఓఎన్జీసీ, టీసీఎస్ తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, జడ్ఈఈఎల్, ఐడియా, బోష్ లిమిటెడ్, అంబుజా సిమెంట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి. బీఎస్ఈలో మొత్తం 2,977 కంపెనీల ఈక్విటీలు ట్రేడింగ్ లో పాల్గొనగా 1,290 కంపెనీలు లాభాలను, 1,513 కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి. బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 1,12,42,311 కోట్ల నుంచి రూ. 1,11,63,294 కోట్లకు తగ్గింది.