: అశ్విన్ తో పోటీకి నేను సిద్ధం: పాక్ స్పిన్నర్ యాసిర్ షా
టెస్ట్ క్రికెట్ లో అత్యంత వేగంగా 100 వికెట్ల తీసిన రెండో బౌలర్ గా చరిత్రకెక్కిన పాకిస్థాన్ లెగ్ స్పిన్నర్ యాసిర్ షా ఇండియన్ టాప్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తో పోటీకి సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. తాను సాధించిన ఈ ఘనతకు అశ్వినే స్ఫూర్తి అని చెప్పాడు. న్యూజిలాండ్ తో సిరీస్ సందర్భంగా 200 వికెట్లు సాధించిన అశ్విన్ తనకు ఒక మెసేజ్ పంపాడని... వెస్టిండీస్ తో జరిగిన తొలి టెస్టులోనే సాధించాల్సిన 100 వికెట్ల రికార్డు కాస్త ఆలస్యమైందని... తర్వాతి మ్యాచ్ లో ఆ ఘనతను సాధించాలంటూ తనకు స్ఫూర్తిదాయకమైన మెసేజ్ పంపాడని తెలిపాడు. తన ఉత్తమ ప్రదర్శనకు ఆ మెసేజ్ పరోక్షంగా ఉపయోగపడిందని చెప్పాడు. భారత్, పాక్ ల మధ్య మ్యాచ్ లు జరగాలని ప్రతి ఒక్క క్రికెటర్ కోరుకుంటాడని... తాను కూడా భారత్ తో ఆడాలని కోరుకుంటున్నానని యయాసిర్ తెలిపాడు. ఇదే సమయంలో, అశ్విన్ తో పోటీ పడాలని భావిస్తున్నానని... అయితే, ఈ పోటీ ఆరోగ్యప్రదంగా ఉంటుందని చెప్పాడు. ఇంగ్లండ్ కు చెందిన జార్జ్ లోమన్ 1896లో 16 టెస్టుల్లోనే 100 వికెట్లు తీశాడు. పాక్ కు చెందిన యాసిర్ షా 17 టెస్టుల్లో ఈ ఘనతను సాధించి, అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన రెండో బౌలర్ గా అవతరించాడు.