: రైళ్లన్నీ ఫుల్, చాంతాడంత వెయిటింగ్ లిస్ట్... శబరిమలకు, సంక్రాంతికి సొంతూరు వెళ్లే దారేది?


జనవరి 17వ తేదీ వరకూ ప్రధాన రైళ్లలోని బెర్తులన్నీ నిండిపోయి వెయిటింగ్ లిస్టు కనిపిస్తోంది. ముఖ్యంగా 40 రోజుల మాలధారణ అనంతరం శబరిమల వెళ్లాలనుకునే వారికి ఏ రైల్లోనూ బెర్తులు లేవు. ఇక సంక్రాంతి పండగకు సొంతూరుకు వెళ్లే వారికీ.. విశాఖపట్నం, చెన్నై, పుణె, ముంబై వంటి ప్రాంతాలకు రైళ్లలో బెర్తులు నిండుకున్నాయి. మూడు నెలల తరువాతి రోజుకి రిజర్వేషన్లు ప్రారంభం కాగానే, నిమిషాల్లో అయిపోయాయి. ప్రత్యేక రైళ్లను ప్రకటించాలని ప్రయాణికులు కోరుతున్నా, ఇప్పటికిప్పుడు ప్రకటించలేని పరిస్థితి నెలకొందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వ్యాఖ్యానించారు. హైదరాబాద్ నగరం నుంచి కేరళకు ఒకే ఒక్క రైలుంది. విజయవాడ, వరంగల్ నుంచి కొన్ని రైళ్లున్నా, అవి పైనుంచి వస్తుంటాయి. తెలుగు రాష్ట్రాల నుంచి 25 నుంచి 30 లక్షల మంది వరకూ శబరిమలకు వెళతారని అంచనాలుండగా, ఒక్కో రైల్లో 500 మంది వరకూ మాత్రమే రిజర్వేషన్ లభిస్తుంది. మిగతా సీట్లు తత్కాల్ లో భాగంగా ప్రయాణానికి ముందు రోజే విక్రయిస్తారన్న సంగతి తెలిసిందే. ఇక విశాఖపట్నానికి ప్రత్యేక రైలు ప్రకటించాలంటే ఈస్ట్ కోస్ట్ అధికారుల అనుమతి, కేరళకు రైళ్లు వేయాలంటే సౌత్ వెస్ట్రన్ అధికారుల అనుమతి అవసరమని, దీంతో మరో నెల రోజుల తరువాత మాత్రమే ప్రత్యేక రైళ్లు ప్రకటించే అవకాశాలున్నాయని రైల్వే శాఖ అధికారులు తెెలిపారు. గడచిన వారం రోజుల నుంచి రాత్రంతా క్యూలో కూర్చుని పొద్దున్నే రైల్వే టికెట్ల కోసం పడిగాపులు పడుతున్న ప్రయాణికులు ప్రతి రైల్వే స్టేషన్ లోనూ కనిపిస్తున్నారు. వీరిలో అత్యధికులు జనవరిలో 5వ తేదీ తరువాత స్వగ్రామాలకు, శబరిమలకు ప్రయాణాలు పెట్టుకున్న వారే కావడం గమనార్హం.

  • Loading...

More Telugu News