: 'చంద్రబాబుకు రాజయోగం లేదు' అని జ్యోతిష్యుడు చెప్పడం వల్లే ఎన్టీఆర్ అప్పుడు ధైర్యంగా వున్నారు!: దాడి
ఎన్టీఆర్ ఆనాటి పరిస్థితులను సరిగ్గా బేరీజు వేయలేకపోయారని దాడి వీరభద్రరావు తెలిపారు. వైస్రాయి ఘటనకు ముందు జరుగుతున్న పరిస్థితులను ఆయన తెలుసుకున్నప్పటికీ ఒక మొండి ధైర్యంతో ఉన్నారని అన్నారు. 'బ్రదర్! ఓట్లేయండని ప్రజలను నేను కోరితే గెలిచిన ఎమ్మెల్యేలు... నన్ను దించేసే పరిస్థితి ఉత్పన్నమవుతుందా?' అని ఆయన ఆలోచించారని దాడి చెప్పారు. వాళ్లు తనను ఊరికే బెదిరిస్తున్నారన్న ఆలోచనలో ఆయన ఉండేవారని ఆయన తెలిపారు. ఆయనను దింపేసే పరిస్థితి వచ్చినప్పుడు.. వ్యతిరేకవర్గాన్ని పిలవాలని తాము సూచించామని ఆయన అన్నారు. దానికి ఆయన అంగీకరించలేదని దాడి చెప్పారు. 'ఏమీ జరగదులే' అన్న ధైర్యం, వారికి తాను లొంగడమేంటనే ఆలోచన కూడా ఉండేదని, దీంతో ఆయన దానికి అంగీకరించలేదని అన్నారు. అందుకు బదులుగా ఆయన ఢిల్లీ నుంచి జాతీయ స్థాయి ఆస్ట్రాలజర్ ను తీసుకొచ్చి, చంద్రబాబు జాతకం ఇచ్చి చూడమన్నారని ఆయన తెలిపారు. దీంతో ఆ జ్యోతిష్యుడు 'రామారావు గారూ, మీరు ఆందోళన చెందాల్సిన పని లేదు, చంద్రబాబుకు రాజయోగం లేదు, ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేద'ని చెప్పారని, ఆయన పట్టుదలకు జ్యోతిష్యుడు చెప్పిన మాటలు కలిసి రావడంతో ఆయనలో ధైర్యం పెరిగిందని ఆయన తెలిపారు. ఈ ఘటన జరిగిన తరువాత కూడా సదరు జ్యోతిష్యుడిపై ఆయనకు నమ్మకం పోలేదని...'చంద్రబాబు పుట్టినరోజు డేట్ తప్పా? లేక ఆయన అలా చెప్పాలని చెప్పారా?' అంటూ ఎన్టీఆర్ తనతో వ్యాఖ్యానించారని ఆయన చెప్పారు.