: డెల్టా ఎయిర్ వేస్ ను విమర్శల్లో ముంచెత్తిన సిబ్బంది తీరు


డెల్టా ఎయిర్ వేస్ సిబ్బంది తీరు ప్రపంచ వ్యాప్తంగా ఆ సంస్థపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తిస్తోంది. వివరాల్లోకి వెళ్తే... డెట్రాయిట్ నుంచి హ్యూస్టన్‌ కు వెళ్తున్న డెల్టా విమానంలో ఓ ప్రయాణికుడు ఉలుకుపలుకు లేకుండా కూర్చున్నాడు. దీనిని గమనించిన విమాన సిబ్బంది అతడు నిద్రపోతున్నాడని భావించారు. కాస్సేపయినా కూడా అతను అదే పొజిషన్ లో ఉండడంతో విమాన సిబ్బంది అతనిని లేపే ప్రయత్నం చేశారు. అయినా ఎలాంటి చలనం లేకపోవడంతో, ఈ తతంగాన్ని మొత్తం గమనిస్తూ కూర్చున్న టిమోకా క్రాస్ అనే వైద్యురాలు అక్కడికి వెళ్లి అతని నాడి పట్టుకుని చూసింది. అంతే, విమాన సిబ్బంది ఆమెపై ఇంతెత్తున లేచారు. 'నువ్వెవరు?' అంటూ ఆమెను నిలదీశారు. దీంతో తాను డాక్టర్‌ నని, అతనికి ఏమైందో చూస్తానని ఆమె తెలిపింది. అయినా పట్టించుకోని వారు... నువ్వెక్కడ పనిచేస్తావ్? నీ ఐడెంటిటీ ఏది? నిన్ను డాక్టర్ అని ఎలా నమ్మాలి? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో వారి ప్రవర్తనకు విసుగుచెందిన డాక్టర్ టిమోకా క్రాస్ తిరిగి తన సీట్లో కూర్చుండి పోయింది. తరువాత అదే విమానంలో ప్రయాణిస్తున్న మరో వైద్యుడు అతడికి వైద్యం చేసేందుకు ముందుకురాగా, అతనిని విమాన సిబ్బంది ఎలాంటి వివరాలు అడగలేదు. ఈ మొత్తం తతంగాన్ని టిమోకా తన ఫేస్‌ బుక్ పేజీలో వివరంగా రాసింది. కేవలం నల్లజాతికి చెందిన మహిళననే ఏకైక కారణంతోనే డెల్టా సిబ్బంది తనను అవమానించారని, డెల్టా సిబ్బంది జాతి వివక్షకు ఇదో నిదర్శనమని ఆమె అందులో ఆరోపించింది. ఆ తరువాత విమాన సిబ్బంది తనను కొన్ని సూచనలు అడిగారని, క్షమించమని కూడా కోరారని ఆమె తెలిపారు. 'డెల్టా' విమానాల్లో తనకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని అన్నారని, అయితే వారి వివరణను, ఆఫర్ ను తిరస్కరించానని ఫేస్‌ బుక్‌ లో వివరించారు. ఇది కాస్తా వైరల్ అయింది. దీంతో ‘డెల్టా’ తీరుపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. తీవ్ర విమర్శలకు దిగివచ్చిన డెల్టా సంస్థ వెంటనే స్పందించింది. ఇలాంటి ఘటన తమ సంస్థలో చోటుచేసుకోవడం గర్హనీయమని పేర్కొంటూ దీనిపై దర్యాప్తు జరిపి దోషులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. కాగా, టెక్సాస్ యూనివర్సిటీ హెల్త్ సైన్స్ సెంటర్ వెబ్‌ సైట్‌ లో ‘టిమోకా క్రాస్, ఎండీ’ రెసిడెంట్ ఫిజీషియన్ అని ఉండడం విశేషం.

  • Loading...

More Telugu News