: బిడ్డను ప్రసవించిన అత్యాచార బాధితురాలు.. శిశువును దత్తత తీసుకుంటామంటూ క్యూ కడుతున్న హిందూముస్లింలు


ఓ ఇంట్లో పనిమనిషిగా చేరి యజమాని కొడుకు అఘాయిత్యానికి బలై బిడ్డను ప్రసవించిన బాలికను ఆదుకునేందుకు పలువురు క్యూ కడుతున్నారు. బిడ్డను తాము దత్తత తీసుకుంటామంటూ బాధితురాలు చికిత్స పొందుతున్న ఆస్పత్రికి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందిన ఆసిఫ్ ఖాన్ ఇంట్లో ఓ బాలిక పనిమనిషిగా చేరింది. బాలికపై కన్నేసిన యజమాని కొడుకు ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఫలితంగా ఆమె గర్భవతి అయింది. ఈ ఘోరంపై బాలిక(16) జూన్ 7న పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. జరిగిన ఘోరంతో కుమిలిపోతున్న ఆమెకు గర్భం వచ్చిందన్న విషయం తెలిసి మరింత కుంగిపోయింది. గర్భస్రావానికి అనుమతించాలంటూ జూలై 26న జ్యూడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించింది. అయితే అప్పటికే 26 వారాల గర్భవతి అవడంతో కోర్టు అందుకు నిరాకరించింది. దీంతో హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది. గురువారం బాలికకు పురిటినొప్పులు రావడంతో అంబులెన్సులో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రసవించింది. దీంతో బిడ్డను నిందితుడి కుటుంబానికి అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించాలని బాధిత బాలిక తల్లిదండ్రులు సిద్ధమయ్యారు. అయితే తమ కుమారుడిని పెళ్లి చేసుకుంటేనే బిడ్డను స్వీకరిస్తామని ఆసిఫ్‌ఖాన్ చెబుతున్నారు. ఇదిలా ఉండగా బాలిక బిడ్డను దత్తత తీసుకుంటామంటూ పలువురు ముందుకు వస్తున్నారు. పదుల సంఖ్యలో ఆమె చికిత్స పొందుతున్న ఆస్పత్రికి చేరుకుని తమకు దత్తత ఇవ్వాలని కోరుతున్నారు. వీరిలో హిందువులు, ముస్లింలు, ధనవంతులు, పేదలు కూడా ఉండడం గమనార్హం. ఆమె గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే తాము ఇక్కడి వచ్చామని వారు చెబుతుండడం విశేషం. అయితే ఈ విషయంలో ఇప్పటి వరకు బాలిక కుటుంబ సభ్యుల నుంచి ఎటువంటి నిర్ణయం వెలువడలేదు.

  • Loading...

More Telugu News