: నైజీరియా దేశాధ్యక్షుడు మొహమ్మద్ బుహారీని గట్టిగా బెదిరించిన ఆయన భార్య
నైజీరియా దేశాధ్యక్షుడు మొహమ్మద్ బుహారీని ఆయన భార్య ఐషా బుహారి బెదిరించారట. ప్రభుత్వ శాఖాధికారుల ఎంపికలో మొహమ్మద్ బుహారీ తీసుకున్న నిర్ణయాల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న ఆమె వెంటనే వారిని మార్చేయాలని చెప్పారు. లేదంటే ప్రభుత్వానికి తాను ఇస్తోన్న మద్దతును ఉపసంహరించుకోవడమే కాకుండా, తన భర్తకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని హెచ్చరించారు. ప్రభుత్వ శాఖాధికారులను మార్చాలంటూ ఆమె చేస్తోన్న డిమాండ్ కి కారణం ప్రెసిడెంట్ బుహారి నియమించిన ఉన్నత అధికారులు ఎవరూ తనకు తెలియకపోవడమేనట. అవినీతిని అంతం చేస్తానని హామీలు గుప్పించి బుహారి దేశాధ్యక్ష పదవికి ఎన్నికయ్యారని ఐషా బుహారి అన్నారు. అయితే, ఊరూ పేరులేని వ్యక్తులను ప్రభుత్వ అధికారులుగా నియమించడం తనకు ఇష్టం లేదని పేర్కొన్నారు. తన భర్త తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోని పక్షంలో ఆమె తాను చేయాల్సింది చేస్తానని చెప్పారు. 2019లో ఆ దేశంలో ఎన్నికలు జరగనున్నాయి. ఐషా బుహారి తన భర్త పట్ల వ్యతిరేకత ప్రదర్శించి ఇప్పటిలాగే కొనసాగితే ఆ దేశంలో బుహారి మరోసారి అధ్యక్షపదవి చేపట్టకుండా ఓడిపోయే ప్రమాదం ఉంది. కొన్ని రోజుల క్రితమే మొహమ్మద్ బుహారి కొత్తగా దాదాపు 50 మందిని ప్రభుత్వ ఉన్నత పదవుల్లో నియమించారు. అయితే, ఆ 520 మందిలో తనకు 45 మంది వరకు ఎవరన్న విషయం తెలియదని ఆమె వాపోయారు. తమ పార్టీ అయిన ఆల్ ప్రొగ్రెసివ్ కాంగ్రెస్ విజన్ గురించి తెలియని వ్యక్తులు ప్రభుత్వ పదవుల్లో ఎలా కొనసాగుతారని బుహారి భార్య ప్రశ్నించారు.