: నొక్కేసిన డబ్బుతో స్నేహితురాలికి రూ. 2.5 కోట్ల కారు గిఫ్ట్... ఒక్కొక్కటిగా వెల్లడవుతున్న షాగీ నేరాలు
అమెరికాలో ప్రభుత్వానికి పన్ను ఎగ్గొడుతున్న వారి వివరాలు తెలుసుకుని, వారికి ఫోన్లు చేసి బెదిరిస్తూ, దాదాపు రూ. 500 కోట్లకు పైగా నొక్కేసిన 23 ఏళ్ల థానే కుర్రాడు సాగర్ ఠక్కర్ అలియాస్ షాగీ నడిపిన విలాస వంత జీవితం గురించిన ఒక్కో విషయాన్నీ పోలీసులు బయటకు లాగుతున్నారు. తాను కొల్లగొట్టిన డబ్బుతో ఎన్నో విలువైన కార్లను షాగీ కొన్నాడని, అహ్మదాబాద్ లో ఆడి ఆర్ 8 కారును కొన్న తొలి వ్యక్తి కూడా షాగీయేనని పోలీసులు తేల్చారు. తన గర్ల్ ఫ్రెండ్ పుట్టినరోజు నాడు ఆమెకు బహుమతిగా రూ. 2.5 కోట్ల విలువైన ఈ కారును గిఫ్టిచ్చాడని తెలిపారు. ఆపై తన స్నేహితులతో ఈ విషయాన్ని గొప్పగా చెప్పుకున్నాడని వివరించారు. ఆ అమ్మాయి ఎవరో కనుక్కొని కారును స్వాధీనం చేసుకుంటామని అధికారులు తెలిపారు. ఇక్కడ సంపాదించిన డబ్బుతో దుబాయ్ లో వ్యాపారాలు మొదలు పెట్టాడని, అమెరికాలో స్కాంకు సంబంధించిన మరో సూత్రధారి ఉన్నాడని అనుమానిస్తున్నామని పోలీసు వర్గాలు తెలిపాయి. అతని నుంచే పన్ను ఎగ్గొట్టిన వారి వివరాలు షాగీకి చేరి వుంటాయని, అతన్ని గుర్తించే పనిలో ఉన్నామని ఓ అధికారి వెల్లడించారు.