: తిరుపతిలో చంద్రబాబు ఆకస్మిక తనిఖీలు.. అధికారులపై ముఖ్యమంత్రి ఆగ్రహం
చిత్తూరు జిల్లా తిరుపతిలోని పలు ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఆకస్మిక తనిఖీలు చేశారు. రుణ సాయం దస్త్రంపై ఇటీవల చంద్రబాబు సంతకం చేయడం పట్ల తిరుపతి డ్వాక్రా మహిళలు చంద్రబాబుతో కేక్ కట్ చేయించారు. తరువాత మొదట అక్కడి స్కావెంజర్స్ కాలనీలో పారిశుద్ధ్య, అభివృద్ధి పనులపై ఆరా తీశారు. మురికి వాడలను తొలగించి వాటి స్థానంలో బహుళ అంతస్తుల భవనాలు నిర్మించి ఇస్తామని చెప్పారు. అక్కడ స్థలాలు లేని వారికి వేరే ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రకటించారు. అనంతరం తుడా కార్యాలయం దారిలో చంద్రబాబు తనిఖీలు చేపట్టారు. పారిశుద్ధ్య పనులు సరిగా లేకపోవడంతో మున్సిపల్, వాటర్ వర్క్స్ అధికారులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి పరిసర ప్రాంతాలన్నింటినీ సుందరవనంగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని అన్నారు. మురికి వాడలో పేరుకుపోయిన చెత్తను పరిశీలించారు. వాటిని వెంటనే తొలగించాలని చెప్పారు. శుభ్రంగా ఉంచుకోని ప్రైవేటు స్థల యజమానులకు నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు చేశారు. చంద్రబాబు వెంట పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు. ముఖ్యమంత్రి తన పర్యటనను ముగించుకొని తిరుపతి విమానాశ్రయానికి బయలుదేరారు. అక్కడి నుంచి ఆయన ప్రత్యేక విమానంలో అమరావతి చేరుకుంటారు.