: శివసేన కార్యకర్తలు నన్ను చంపాలని చూస్తున్నారు: బీజేపీ ఎంపీ పిర్యాదు
శివసేన కార్యకర్తలు తనను హత్యచేసేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ ఎంపీ కిరీట్ సోమయ్య ముంబయి పోలీస్ కమిషనర్ కు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. ఈశాన్య ముంబై నియోజకవర్గ ఎంపీ సోమయ్య మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ గ్రేటర్ ముంబై (ఎంసీజీఎం) లో చోటుచేసుకుంటున్న అవినీతిపై శివసేనను లక్ష్యంగా చేసుకుని పలుమార్లు ప్రశ్నించారు. ఎంసీజీఎంలో మాఫియారాజ్ నడుస్తోందని, అవినీతి పెచ్చరిల్లిందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా ఎంసీజీఎంలో చోటుచేసుకున్న అవినీతి, మాఫియారాజ్ పై పోరాడుతానని ప్రకటించారు. ఈ క్రమంలో ముంబైలో సోమయ్య నిర్వహించిన దసరా వేడుకల్లో బీజేపీ కార్యకర్తలు ఎంసీజీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. దీనిని శివసేన కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ సందర్భంలో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం సోమయ్య ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు 13 మందిని అదుపులోకి తీసుకున్నారు.