: జయలలిత కోసం ఆసుపత్రికి వస్తోన్న వారికి ఉచితంగా కొబ్బరి నీళ్లు ఇస్తోన్న వీరాభిమాని.. మూడు వారాల నుంచి ఆసుపత్రి వద్దే ఆటోడ్రైవర్
సెప్టెంబరు 22 నుంచి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చెన్నైలోని అపోలో ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జయలలిత కోసం ఆసుపత్రికి వస్తోన్న వారికి అపోలో ఆసుపత్రి ముందు 'అమ్మ' పేరుతో ఆమె అభిమానులు ఉచితంగా భోజనం పెడుతున్నారు. మరోవైపు, జయలలిత వీరాభిమాని అయిన చెన్నైకి చెందిన ఆటోడ్రైవర్ సుగుమార్.. ఆమె ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆసుపత్రి ఆవరణలోనే కనిపిస్తున్నాడు. అపోలో ఆసుపత్రి వద్ద రోగులకు ఉచిత ఆటో సర్వీసుని అందిస్తున్న సుగుమార్ తాజాగా తన సేవలను మరింత పెంచాడు. ఈ రోజు ఆటోనిండా కొబ్బరి బోండాలు తీసుకొచ్చాడు. జయలలిత కోసం వస్తోన్న అభిమానులకు ఉచితంగా కొబ్బరి నీళ్లు అందిస్తున్నాడు. తన సేవా కార్యక్రమాల కోసం మొత్తం రూ. 19,000 ఖర్చు చేసినట్లు మీడియాకు చెప్పాడు. మరోవైపు ఆసుపత్రి ప్రాంగణంలో జయలలిత కోసం ఆమె అభిమానులు ప్రార్థనలు కొనసాగిస్తున్నారు.