: మిస్ యూఎస్ఏ పోటీదారులను నగ్నంగా చూసి పైశాచికానందం పొందిన ట్రంప్: సంచలన ఆరోపణలు చేసిన ఆరిజోనా మాజీ అందాల సుందరి


రిపబ్లికన్ల తరఫున అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న ట్రంప్ చుట్టూ కష్టాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఆయన గత జీవితంలోని మరకలు ఒక్కొక్కటీ ఇప్పుడాయన ప్రతిష్ఠను మసకబారుస్తున్నాయి. ఇప్పటికే మహిళలపై అనుచిత వ్యాఖ్యల నుంచి కుమార్తె అందాలను పొగడటం వరకూ ఎన్నో ఆరోపణల్లో అడ్డంగా చిక్కుకున్న ట్రంప్ పై మాజీ మిస్ ఆరిజోనా (2001) తాషా డిక్సన్ సంచలన ఆరోపణలు చేసింది. 2005 ఏప్రిల్ లో మిస్ అమెరికా పోటీలు జరుగుతున్న వేళ, ప్రధాన స్పాన్సరర్ గా ఉన్న ట్రంప్, పోటీదారుల డ్రస్సింగ్ రూములో తిష్ట వేసుకుని కూర్చుని అమ్మాయిలను నగ్నంగా చూస్తూ ఆనందం పొందాడని ఆరోపించింది. పోటీలు జరుగుతున్న సమయంలో అక్కడికి వచ్చిన ట్రంప్ తనతో మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటూ, "నేను ఇప్పుడు స్టేజ్ వెనక్కు వెళుతున్నాను. అందరూ దుస్తులు ధరించి సిద్ధమవుతుంటారు. అక్కడ పురుషులు ఎవరూ ఉండరు. కానీ నేను మాత్రం వెళ్లగలను. ఎందుకంటే, ఈ పోటీల యజమానిని నేనే కాబట్టి. వెళ్లి పరిశీలించి వస్తాను" అని అన్నాడని, ఆపై లోపలికి వెళ్లి వచ్చి "నీకు తెలుసా? వారంతా నగ్నంగా నిలబడి వున్నారు. ఎంత అందమైన అమ్మాయిలు... ఇలాంటి వాళ్లతో బయటకు వెళ్లిపోవాలని ఆలోచిస్తున్నా" అన్నారని పేర్కొంది. పోటీల్లో భాగంగా, యువతులు సాధారణ దుస్తుల నుంచి బికినీల్లోకి మారుతున్న వేళ ట్రంప్ అక్కడే నిలబడి ఆనందం పొందాడని, ఎవరూ అడ్డుచెప్పలేక పోయారని తాషా డిక్సన్ వెల్లడించింది. "అతను గదిలోకి వచ్చిన వేళ అడ్డుకునేందుకు ఎవరూ లేరు. కొంతమంది టాప్ లెస్ గా ఉండగా, మరికొందరు పూర్తి నగ్నంగా ఉన్నారు. అర్ధనగ్నంగా ఉన్న నేను బికినీ ధరిస్తున్న వేళ ట్రంప్ ను చూశాను. ఏమీ చేయలేని పరిస్థితి అక్కడి పోటీదారులది. అక్కడున్న కొందరు, ట్రంప్ వద్దకు వెళ్లి, అతని దృష్టిలో పడాలని మాకు సలహాలు కూడా ఇచ్చారు. ఆ సమయంలో అతనిపై మాకు ఫిర్యాదు చేయాలని వున్నా ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి" అని పేర్కొంది. ఇదిలావుండగా, 1997 మిస్ టీన్ యూఎస్ఏ అందాల పోటీల వేళ జరిగిన ఓ ఘటనను 'బుజ్ ఫీడ్' ప్రత్యేక కథనంగా ప్రచురించింది. నాడు ట్రంప్ చేసిన పనిని ముగ్గురు పోటీదారులు పేరును వెల్లడించకుండా తెలియజేస్తే, నాటి పోటీదారు, ఆపై మిస్ వెర్మాంట్ గా గెలిచిన మారియా బిల్లాడో తన పేరును వాడవచ్చని చెబుతూ ట్రంప్ నిర్వాకాన్ని వెల్లడించింది. "నేను నా దుస్తులను వేగంగా మార్చుకుంటున్నాను. హో మై గాడ్. అక్కడో పురుషుడు ఉన్నాడు. ఎంతో భయపడ్డా" అని మారియా తెలిపింది.

  • Loading...

More Telugu News