: సర్జికల్ దాడులు జరిగి ఉంటే పాక్ తప్పకుండా తిప్పి కొట్టేది: పాక్ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్


తమ భూభాగంపై నిజంగా సర్జికల్ దాడులు కనుక జరిగి ఉంటే పాక్ బలగాలు వాటిని వెంటనే తిప్పికొట్టి ఉండేవని భారత్‌లో పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ అన్నారు. గతనెల 29న నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉగ్రవాదుల స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించి పలువురు ఉగ్రవాదులను భారత దళాలు హతమార్చిన సంగతి తెలిసిందే. సర్జికల్ దాడులపై బుధవారం మాట్లాడిన బాసిత్ అలాంటిదేమీ జరగలేదని, అదే కనుక జరిగి ఉంటే పాక్ బలగాలు వెంటనే తిప్పి కొట్టేవని పేర్కొన్నారు. ఇక భారత్‌కు చెందిన ఓ టెలివిజన్ చానల్ మిర్పూర్‌లోని పాక్ పోలీసు అధికారితో మాట్లాడినట్టు చెబుతున్నదంతా బూటకమన్నారు. అది పూర్తిగా ఫ్యాబ్రికేట్ చేసిన సంభాషణ అని తేల్చి చెప్పారు. ఆ సంభాషణలో తన పై అధికారితో మాట్లాడుతున్నట్టు భ్రమించిన పోలీస్ అధికారి భారత్ సర్జికల్ దాడులు నిర్వహించిన విషయం నిజమేనని చెప్పిన సంగతి తెలిసిందే. "అక్కడసలు సర్జికల్ స్ట్రయిక్స్ జరగనే లేదు. జరిగినవి కేవలం ఇరువర్గాల మధ్య కాల్పులే. ఆ ఘటనలోనే ఇద్దరు పాక్ సైనికులు మృతిచెందారు. నిజానికి భారత్ చెబుతున్నట్టు సర్జికల్ స్ట్రయిక్స్ కనుక జరిగి ఉంటే పాక్ వెంటనే వాటిని తిప్పి కొట్టేది. ఒక్క భారత సైనికుడు కూడా సరిహద్దు దాటలేదు" అని ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాసిత్ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News